Rasikt Mandal | కోల్కతా/మాల్డా: హత్య కేసులో 36 సంవత్సరాలుగా జైలులో మగ్గిన 104 సంవత్సరాల వృద్ధుడు ఎట్టకేలకు పశ్చిమ బెంగాల్లోని మాల్డా జైలు నుంచి విడుదలయ్యాడు. భూ వివాదంలో తన సోదరుడిని హత్య చేశాడన్న ఆరోపణలపై 1988లో అరెస్టయిన రసిక్త్ మోండల్కు మాల్డాలోని జిల్లా, సెషన్స్ కోర్టు 1992లో యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. 72 ఏళ్ల వయసులో మోండల్ జైలులోకి ప్రవేశించారు.
అయితే కోల్కతా హైకోర్టులో ఈ కేసు విచారణ సందర్భంగా బెయిల్పై ఆయన విడుదలయ్యారు. దిగువ కోర్టు తీర్పును హైకోర్టు సమర్థించడంతో ఆయన 2020లో తిరిగి జైలుకు వెళ్లక తప్పలేదు. ఎట్టకేలకు సుప్రీంకోర్టు ఆదేశాలతో మంగళవారం మాల్డా జైలు నుంచి ఆయన విడుదలయ్యారు. తన శేష జీవితాన్ని, మొక్కలతో, మనవలతో గడుపుతానని మోండల్ తెలిపారు. తాను నిరపరాధినని, విధి వంచితుడినని ఆయన వాపోయారు. తన భర్త జైలు నుంచి విడుదలై తిరిగి తన కుటుంబాన్ని చేరుకోవడం పట్ల ఆయన భార్య మీనా మోండల్ సంతోషం వ్యక్తం చేశారు.