ఇటానగర్: పది వేల అడుగుల ఎత్తులో, 104 అడుగుల జాతీయ జెండా రెపరెపలాడుతున్నది. చైనా సరిహద్దు సమీపంలోని అరుణాచల్ ప్రదేశ్‌లో దీనిని ఏర్పాటు చేశారు. ప్రముఖ బౌద్ధ క్షేత్రమైన తవాంగ్‌లోని బుద్ధ పార్క్‌లో ఈ భారీ జాతీయ జెండాను అరుణాచల్ ప్రదేశ్ సీఎం పెమా ఖండూ శుక్రవారం ఆవిష్కరించారు.
పది వేల అడుగుల ఎత్తులో, 104 అడుగుల జాతీయ జెండా ఏర్పాటుకు కృషి చేసిన ఆర్మీ, సశాస్త్ర సీమా బల్, ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్, తవాంగ్ జిల్లా యంత్రాంగం, స్థానిక ఎమ్మెల్యే త్సెరింగ్ తాషికి అరుణాచల్ సీఎం ధన్యవాదాలు తెలిపారు. స్మారక జాతీయ జెండాను, దేశభక్తి కలిగిన రాష్ట్ర ప్రజలకు అంకితం చేస్తున్నట్లు పెమా ఖండూ చెప్పారు. దేశంలో అత్యంత ఎత్తులో ఉన్న జాతీయ జెండాలలో ఇది రెండోదని ట్విట్టర్లో పేర్కొన్నారు. కేంద్ర మంత్రి కిరణ్ రిజ్జు కూడా ఈ భారీ జెండా ఫొటోలను ట్వీట్ చేశారు. ‘జైహింద్’ అని ట్యాగ్ చేశారు.
మరోవైపు అరుణాచల్ ప్రదేశ్ సమీపంలోని వాస్తవ నియంత్రణ రేఖ వద్ద తన కార్యకలాపాలను చైనా ఉధృతం చేస్తున్నది. సరిహద్దు ప్రాంతాల్లో భారీగా అక్రమ నిర్మాణాలు చేపడుతున్నది. ఈ నేపథ్యంలో చైనాకు నిత్యం కనిపించేలా, ఆ దేశానికి కంటగింపుకలిగేలా పది వేల అడుగుల ఎత్తులో, 104 అడుగుల జాతీయ జెండాను భారత్ ఏర్పాటు చేయడం ప్రాధాన్యత సంతరించుకున్నది.