కొత్తగూడెం ప్రగతి మైదాన్, అక్టోబర్ 3: ఛత్తీస్గఢ్లో 103 మంది మావోయిస్టు పార్టీ సభ్యులు సీఆర్పీఎఫ్ ఐజీ బీఎస్ నేగి, దంతేవాడ రేంజ్ డీఐజీ కమలోచన్ కశ్యప్, జిల్లా ఎస్పీ జితేంద్ర యాదవ్ సమక్షంలో గురువారం లొంగిపోయారు. పార్టీ సిద్ధాంతాలపై అసంతృప్తి చెంది 103 మంది సభ్యులు గాంధీ జయంతి రోజున లొంగిపోయినట్టు అధికారులు వెల్లడించారు. వీరిలో 49 మంది క్యాడర్ ఉన్న మావోయిస్టులు ఉండగా.. వారిపై రూ.1.06 కోట్ల రివార్డులు ఉన్నాయి. ఇప్పటివరకు బీజాపూర్ జిల్లాలో 410 మంది మావోయిస్టులు లొంగిపోగా, 421 మంది అరెస్ట్ అయ్యారు.
మరో 138 మంది మావోయిస్టులు వివిధ ప్రాంతాల్లో జరిగిన ఎదురు కాల్పుల్లో మృతి చెందారు. ఎదురు కాల్పుల్లో ఒక మావోయిస్టు మృతి చెందిన ఘటన ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలో గురువారం జరిగింది. బీజాపూర్ జిల్లా గంగలూరు పోలీస్స్టేషన్ పరిధిలోని అడవుల్లో మావోయిస్టులు సంచరిస్తున్నారనే విశ్వసనీయ సమాచారం మేరకు భద్రతా బలగాలు సంయుక్తంగా సెర్చింగ్ ఆపరేషన్ చేపట్టాయి. మావోయిస్టులు తారసపడి జవాన్లపైకి కాల్పులు జరపడంతో, వారు ఎదురుకాల్పులకు దిగారు.