లక్నో: ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలోని డిఫెన్స్ ఇండస్ట్రియల్ కారిడార్‌లో నిర్మించిన బ్రహ్మోస్ ఏరోస్పేస్ ఇంటిగ్రేషన్ అండ్ టెస్టింగ్ ఫెసిలిటీని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆదివారం వర్చువల్‌గా ప్రారంభించారు. 2021లో శంకుస్థాపన జరుగ్గా మూడున్నర ఏళ్లలో బ్రహ్మోస్ క్షిపణుల తయారీ యూనిట్ పూర్తయ్యింది. (BrahMos missiles) రూ.300 కోట్ల వ్యయంతో నిర్మించిన లక్నో యూనిట్లో తొలుత ఏడాదికి 80 నుంచి 100 బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూయిజ్ క్షిపణులు తయారవుతాయి. ఆ తర్వాత ప్రతి సంవత్సరం 100 నుంచి 150 అధునాతన వేరియంట్లను ఉత్పత్తి చేయడానికి దీనిని విస్తరించనున్నారు.
కాగా, లక్నో యూనిట్లో 290 నుంచి 400 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను చేధించే క్షిపణులను ఉత్పత్తి చేస్తారు. మాక్ 2.8 (సుమారు గంటకు 3,430 కి.మీ) గరిష్ట వేగంతో ఇది ప్రయాణిస్తుంది. అధిక ఖచ్చితమైన దాడుల కోసం బ్రహ్మోస్ క్షిపణిలో ‘ఫైర్ అండ్ ఫర్గాట్’ సాంకేతికను వినియోగిస్తారు. ప్రస్తుతం 2,900 కిలోల బ్రహ్మోస్ క్షిపణి బరువు తర్వాత వేరియంట్లలో 1290 కిలోల వరకు తగ్గనున్నది. దీంతో ప్రస్తుతం సుఖోయ్ యుద్ధ విమానం ఒక బ్రహ్మోస్ క్షిపణిని మోసుకెళ్లగా భవిష్యత్తులో మూడు క్షిపణులను మోసుకెళ్లే వీలుంటుంది.
మరోవైపు భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో) రష్యాకు చెందిన ఎన్పీవో మషినోస్ట్రోయేనియా (సైంటిఫిక్ ప్రొడక్షన్ అసోసియేషన్ ఆఫ్ మెషిన్-బిల్డింగ్) జాయింట్ వెంచర్ అయిన బ్రహ్మోస్ ఏరోస్పేస్ ఈ క్షిపణిని అభివృద్ధి చేసింది. భూమి, సముద్రంతో పాటు గాలి నుంచి అన్ని వాతావరణ పరిస్థితులు, పగలు, రాత్రి వేళలతోపాటు పలు విధాలుగా దీనిని ప్రయోగించవచ్చు. పాకిస్థాన్‌పై చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’ దాడుల్లో బ్రహ్మోస్ క్షిపణి తన సత్తా చాటింది.