కోల్‌కతా, నవంబర్ 24: వైద్యుల నిర్లక్ష్యం వల్లే చనిపోయాడని ఆరోపిస్తూ రోగి బంధువులు, సన్నిహితులు కోల్‌కతాలో ప్రభుత్వ దవాఖానపై దాడికి తెగబడ్డారు. చనిపోయిన రోగికి సంబంధించిన 100 మందితో కూడిన గుంపు దవాఖానలో రణరంగం సృష్టించింది. బెహలాలోని విద్యాసాగర్ ప్రభుత్వ దవాఖానలో శుక్రవారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు ఘటనా స్థలానికి వచ్చినా, పరిస్థితి అదుపులోకి రావడానికి నాలుగు గంటలు పట్టింది. 32 ఏండ్ల పేషెంట్ దవాఖానలో చనిపోవటం ఈ ఘటనకు దారితీసింది. వైద్యుల నిర్లక్ష్యమే రోగి చనిపోవటానికి కారణమంటూ కొంతమంది దవాఖాన అద్దాలు, తలుపులు పగలగొట్టారు. ఔషధాల్ని, ఇంజెక్షన్లను బయటకు విసిరేస్తూ.. అక్కడి సిబ్బందిపై దాడికి దిగారు. కుర్చీలు, టేబుళ్లు, ఇతర ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారు. ఈ ఘటనలో ముగ్గురు నర్సులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ కేసుకు సంబంధించి పోలీసులు 9 మందిని అరెస్టు చేశారు. మరో 13మందిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.