New Airports : ప్రాంతీయ ఎయిర్ కనెక్టివిటీ పెంచేందుకు దేశంలో 100 కొత్త ఎయిర్పోర్టులు నిర్మిండానికి కేంద్రం సిద్ధమైంది. ఈ మేరకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. దీనిలో భాగంగా ఎయిర్పోర్టులతోపాటు, హెలిపోర్టులు, వాటర్ ఏరోడ్రోమ్స్ను కూడా కేంద్రం నిర్మించనుంది. 2026-2027 నుంచి 2035-2036 వరకు, పదేళ్లపాటు ఉడాన్ స్కీమ్ కింద వీటిని నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
దీనికోసం రూ.28,840 కోట్లను కేంద్రం కేటాయించనుంది. దీని ద్వారా చిన్న పట్టణాలకు ప్రాంతీయ ఎయిర్ కనెక్టివిటీ పెరుగుతుందని కేంద్రం చెబుతోంది. ఏవియేషన్ నెట్వర్క్ను విస్తరించడం, ప్రాంతీయ రవాణా వ్యవస్థ బలోపేతం, ఆర్థిక రంగానికి ఊతమివ్వడం వంటి లక్ష్యాలతో కేంద్రం కొత్త ఎయిర్పోర్టుల నిర్మాణానికి శ్రీకారం చుట్టనుంది. ఇప్పటివరకు ఎయిర్ కనెక్టివిటీ లేని టైర్ 2 పట్టణాల నుంచి టైర్ 3 పట్టణాల వరకు, హిల్ స్టేషన్లు, సరిహద్దు ప్రాంతాలు, ఐలాండ్స్ ఇలా మొత్తంగా 100 ఎయిర్పోర్టులు వంటివి నిర్మిస్తారు. అలాగే, ఎయిర్పోర్టులు నిర్మించడానికి వీలుకాని ప్రదేశాల్లో 200 ప్రత్యేక హెలిప్యాడ్లు, వాటర్ ఏరోడ్రోమ్స్ వంటివి కూడా నిర్మితమవుతాయి.
అలాగే 441 ఏరోడ్రోమ్ల నిర్మాణంతోపాటు నిర్వహణ ఖర్చుల కోసం మరో రూ.2,577 కోట్లను కూడా కేంద్రం కేటాయించనుంది. మరోవైపు ఇప్పటికే నిర్మితమై ప్రయాణికుల డిమాండ్ తక్కువగా ఉన్న చోట కూడా ఇకపై సేవలు నిరంతరాయంగా కొనసాగుతాయి. వాటిని రద్దు చేయరు.