శ్రీహరికోట: జీఎస్ఎల్వీ ఎఫ్-15 రాకెట్ ద్వారా ఇవాళ ఇస్రో నావిగేషన్ శాటిలైట్‌ను నింగిలోకి పంపింది. దీంతో వందో ప్రయోగ మైలురాయిని ఇస్రో అందుకున్నది. వంద రాకెట్ ప్రయోగాలను చేపట్టేందుకు ఇస్రోకు 46 ఏళ్లు పట్టింది. అయితే డబుల్ సెంచరీ మాత్రం మరో అయిదేళ్లలోనే పూర్తి కానున్నట్లు ఇస్రో పేర్కొన్నది. రానున్న అయిదేళ్లలో మరో 100 ప్రయోగాలు చేపట్టేందుకు ఇస్రో సిద్ధంగా ఉన్నట్లు చైర్మెన్ వీ నారాయణన్(V Narayanan) తెలిపారు. జీఎస్ఎల్వీ ఎఫ్-15 ఎన్వీఎస్-02 నావిగేషన్ శాటిలైట్ ప్రయోగంతో.. వంద మిషన్ల మైలురాయిని ఇస్రో చేరుకున్నది. ఈ నేపథ్యంలో ఇస్రో చైర్మెన్ మాట్లాడుతూ.. మరో అయిదేళ్లలో 200 మార్క్‌ను అందుకోనున్నట్లు ఆయన విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. రాబోయే అయిదేళ్లలో వంద ప్రయోగాలు చేపట్టవచ్చా అని వేసిన ప్రశ్నకు ఆయన సమాధానం ఇచ్చారు. మీరు సరైన ప్రశ్నే అడిగారని, అది సాధ్యమే అని ఇస్రో చైర్మెన్ వీ నారాయణన్ తెలిపారు.
గడిచిన 46 ఏళ్లలో.. 548 శాటిలైట్లను కక్ష్యలోకి పంపింది ఇస్రో. దీనితో పాటు 120 టన్నుల పేలోడ్ పంపించింది. దీంట్లో 433 విదేశీ శాటిలైట్లకు చెందిన 23 టన్నుల పేలోడ్ కూడా ఉన్నట్లు ఇస్రో చీఫ్ తెలిపారు. నాసాతో సాగుతున్న సహకారంపై ఆయన మాట్లాడుతూ.. త్వరలో నిసార్ మిషన్ చేపట్టనున్నట్లు వెల్లడించారు. ఎన్జీఎల్వీ ప్రాజెక్టు కూడా ఉన్నట్లు ఆయన చెప్పారు. సింథటిక్ అపర్చర్ రేడార్ శాటిలైట్ మిషన్ ప్రయోగంలో రెండు రేడార్లు ఉంటాయి. ఎల్ బ్యాండ్ రేడార్‌ను ఇస్రో, ఎస్ బ్యాండ్ రేడాను నాసా జేపీఎల్ అభివృద్ధి చేయనున్నాయి. బెంగుళూరులోని యూఆర్ రావు శాటిలైట్ సెంటర్లో దీన్ని డెవలప్ చేస్తున్నారు.
ప్రస్తుతం భారత్‌కు నాలుగు రకాల నావిగేషన్ శాటిలైట్లు అందుబాటులో ఉన్నాయని, ఇవాళ జరిగిన ప్రయోగం అయిదోది అని, మరో మూడింటికి ఆమోదం వచ్చిందన్నారు. మరో అయిదారు నెలల్లో నావిగేషన్ శాటిలైట్‌ను ప్రయోగించనున్నట్లు ఇస్రో చైర్మెన్ నారాయణన్ తెలిపారు. తమిళనాడులోని కులశేఖరపట్టణం నుంచి చేపట్టబోయే రాకెట్ ప్రయోగాల గురించి మాట్లాడుతూ.. అక్కడ బిల్డింగ్ నిర్మాణాలు పూర్తి కావడానికి మరో రెండేళ్లు పడుతుందన్నారు. నిర్మాణాలు పూర్తి అయిన తర్వాత అక్కడి నుంచి కూడా ప్రయోగాలు చేపట్టనున్నట్లు ఇస్రో చీఫ్ వెల్లడించారు.
నెక్ట్స్ జనరేషన్ లాంచ్ వెహికిల్స్(ఎన్జీఎల్వీ)ను ప్రయోగించేందుకు నిర్మాణం చేపట్టాలని కేంద్రం నుంచి ఇస్రోకు అనుమతులు వచ్చినట్లు నారాయణన్ తెలిపారు. ఎన్జీఎల్వీ రాకెట్లు భూకక్ష్యలోకి 20 టన్నుల పేలోడ్ మోసుకెళ్లగలవు. జియోస్టేషనరీ ఆర్బిట్‌లోకి 10 టన్నుల బరువు మోసుకెళ్తాయి. ఇలాంటి రాకెట్లకు ఎక్కువ డిమాండ్ ఉన్నట్లు చెప్పారు. ఎన్జీఎల్వీ రాకెట్లను శ్రీహరికోటలో నిర్మిస్తున్న మూడవ లాంచ్ ప్యాండ్ నుంచి ప్రయోగించనున్నట్లు తెలిపారు. చంద్రయాన్ 4, 5 మిషన్ల కోసం ఎన్జీఎల్వీ రాకెట్లను వాడనున్నట్లు చెప్పారు. గగన్‌యాన్1 మిషన్ కోసం ప్రస్తుతం ప్రిపరేషన్ జోరుగా సాగుతున్నట్లు ఇస్రో చీఫ్ తెలిపారు.