న్యూఢిల్లీ, జూన్ 15: బలమైన ఈదురు గాలులు, భారీ వర్షం ధాటికి దక్షిణ ఢిల్లీలో 100 అడుగుల ఎత్తున్న ఓ మొబైల్ టవర్ కుప్పకూలింది. ఆదివారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో సఫ్దార్జంగ్ ఎన్క్లేవ్ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. అదృష్టవశాత్తు ఈ ప్రమాద ఘటనలో ఎవ్వరూ గాయపడలేదని స్థానిక పోలీసులు తెలిపారు.
ఆప్ మాజీ ఎమ్మెల్యే సోమ్నాథ్ భారతి ఘటనాస్థలానికి చేరుకొని స్థానికులతో మాట్లాడారు. ‘స్థానికులు, నేను వ్యతిరేకించినా ఇక్కడ మొబైల్ టవర్ను ఏర్పాటుచేశారు. ఈరోజు అది కుప్పకూలింది. ఒకవేళ ఇది పగటి సమయంలో జరిగివున్నా, బీ2 భవనంపైన పడివున్నా పరిస్థితి ఏంటి? ఇలాంటి నిర్లక్ష్య వైఖరి నేరం’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.