(స్పెషల్ టాస్క్ బ్యూరో)హైదరాబాద్, జూలై 19(నమస్తే తెలంగాణ): 2047 నాటికి దేశానికి స్వాతంత్య్రం వచ్చి శత వసంతాలు పూర్తవుతాయి. ఆ సమయానికి దేశంలో మధ్యతరగతి జనాభా 102 కోట్లకు చేరుకోనున్నది. ఈ మేరకు మేధో సంస్థ పీపుల్ రీసెర్చ్ ఆన్ ఇండియాస్ కన్జూమర్ ఎకానమీ (ప్రైస్) ఓ నివేదికలో వెల్లడించింది. దేశవ్యాప్తంగా 25 రాష్ర్టాల్లోని దాదాపు 40 వేల కుటుంబాల్లో చేసిన సర్వేను బట్టి ఈ మేరకు ఆ సంస్థ అంచనా వేసింది. 2047 నాటికి దేశ జనాభా 166 కోట్లకు చేరొచ్చని ప్రైస్ వివరించింది. అదే సమయంలో ధనవంతుల జనాభా 43.7 కోట్లకు పెరగొచ్చని అంచనా వేసింది.
పేదలు పెరగొచ్చు!
ప్రస్తుతం దేశంలో కట్టలు తెంచుకొన్న ద్రవ్యోల్బణం, నిరుద్యోగం మధ్యతరగతి వారిని పేదలుగా, పేదలను నిరుపేదలుగా మారుస్తున్నదని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ఈ పరిస్థితులు ఇలాగే కొనసాగితే, పేదల జనాభా తగ్గబోతుందన్న ప్రైస్ అంచనాలు తలకిందులు కావొచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. 2020-21 ధరలను బట్టి ప్రైస్ ఈ అంచనాలు వేసిందని, గడిచిన రెండేండ్లలో ధరలు, నిరుద్యోగం అమాంతం పెరిగిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. రానున్న 24 ఏండ్ల పాటు దేశ సగటు జీడీపీ 7.6 శాతంగా కొనసాగితే 2047 నాటికి భారత్ అభివృద్ధి చెందిన దేశంగా మారుతుందని ఇటీవల ఆర్బీఐ కూడా అంచనా వేసిందని.. అయితే ప్రస్తుత ద్రవ్యోల్బణ పరిస్థితులను చూస్తే అది సాధ్యపడకపోవచ్చని అభిప్రాయపడుతున్నారు.
ప్రైస్ చార్ట్ ప్రకారం ఎవరు ఏ క్యాటగిరీ? (2020-21 ధరల ప్రకారం)