(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, డిసెంబర్ 17 (నమస్తే తెలంగాణ): అది బీహార్‌లోని దర్భంగా జిల్లా అహియారి గ్రామం. గ్రామ జనాభా 16 వేల వరకూ ఉంటుంది. ఎన్నికల్లో వీరి ఓట్లు చాలా కీలకం. రెక్కాడితే గానీ డొక్కాడని పరిస్థితి వాళ్లది. అలాంటి వారి ఖాతాల్లో మూడు నెలల కిందట రూ. 10 వేలు జమయ్యింది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ‘ముఖ్యమంత్రి మహిళా రోజ్‌గార్ యోజన’ పథకంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 1.4 కోట్ల మంది మహిళల బ్యాంకు ఖాతాల్లో ఎన్డీయే సర్కారు రూ. 10 వేలు జమ చేసింది. అయితే, ఇక్కడే ఓ ట్విస్ట్ కనిపించింది. అహియారి గ్రామంలోని మహిళలతో పాటు కొందరు పురుషుల ఖాతాల్లోనూ రూ. 10 వేల చొప్పున డబ్బు జమ అయ్యింది. దీంతో ప్రభుత్వం తమను కూడా ఆర్థికంగా ఆదుకోవడానికే ఇలా సాయం చేసిందని వాళ్లు ఎంతో సంబురపడ్డారు. ఎన్నికల్లో ఎన్డీయే కూటమికే ఓటేశారు. దీంతో నితీశ్ నేతృత్వంలోని ఎన్డీయే సర్కారు అధికారంలోకి వచ్చింది.
షాకిచ్చిన అధికారులు
ఎన్నికలు ముగిసిన దాదాపు మూడు నెలల తర్వాత పురుషులకు ప్రభుత్వాధికారులు షాకిచ్చారు. సాంకేతిక సమస్యల కారణంగా పురుషుల ఖాతాల్లో పొరపాటున డబ్బు జమయ్యిందని, దాన్ని తిరిగి ఇచ్చేయ్యాలని నోటీసులు జారీ చేశారు. దీంతో ప్రభుత్వ వైఖరిపై గ్రామంలోని పురుషులు మండిపడుతున్నారు. నిజంగా సాంకేతిక పొరపాటు జరిగితే, పోలింగ్‌కు ముందే డబ్బును అడగాలని, గెలిచిన మూడు నెలల తర్వాత ఇప్పుడు అడగడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు.
డబ్బిచ్చారు.. ఓటేశాం..
నేను దివ్యాంగుడిని. మహిళలకు ఆర్థిక సాయం చేస్తున్నట్టుగానే, దివ్యాంగుడినైన నాకు కూడా ఎన్డీయే సర్కారు సాయం చేసిందని సంబురపడ్డా. ఇప్పుడు పొరపాటుగా డబ్బు జమయ్యిందంటున్నారు. పొరపాటు అయితే, ఎన్నికలకు ముందే ఎందుకు అడగలేదు? ఇప్పుడు ఎందుకు అడుగుతున్నారు? నేను డబ్బు తిరిగిచ్చే ప్రసక్తే లేదు. వాళ్లు డబ్బు ఇచ్చారు. ఓటేసి ఎన్డీయేను గెలిపించా. అకౌంట్ సెటిలైంది అంతే.
– నరేంద్ర రామ్, దివ్యాంగుడు
గెలిచాక.. అడుగుతున్నారు..
గెలిచిన 3 నెలల తర్వాత ఇప్పుడు డబ్బులు అడుగుతున్నారు. దివ్యాంగుడినైన నేను అంత డబ్బు ఎలా చెల్లించగలను. ప్రభుత్వం మోసం చేసింది.
-బలిరామ్ సహానీ, దివ్యాంగుడు
డబ్బు కావాలంటే, ఓట్లు వెనక్కి ఇవ్వాలి
మాకు ఇచ్చిన డబ్బులు ప్రభుత్వానికి కావాలనుకొంటే, మేము వేసిన ఓట్లను ఎన్డీయే సర్కారు తిరిగి వెనక్కి ఇచ్చెయ్యాలి.
– ప్రమీళాదేవి, గ్రామస్థురాలు