ముంబై, అక్టోబర్ 27: ముంబైలోని బాంద్రా రైల్వే స్టేషన్లో జరిగిన తొక్కిసలాటలో ఆదివారం 10 మంది గాయపడ్డారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. యూపీలోని గోరఖ్‌పూర్ వెళ్లే అంత్యోదయ ఎక్స్‌ప్రెస్ ప్లాట్‌ఫాంపైకి వస్తుండగా, అందులో ఎక్కడానికి పెద్దయెత్తున ప్రయాణికులు ఎగబడటంతో తొక్కిసలాట జరిగింది. దీపావళి, ఛాత్ పండుగల నేపథ్యంలో సొంత ఊళ్లకు వెళ్లడానికి పెద్దయెత్తున ప్రయాణికులు బాంద్రా స్టేషన్‌కు చేరుకున్నారు. ఉదయం 5.10 గంటలకు రైలు బయలుదేరాల్సి ఉండగా, సుమారు మూడు గంటల ముందు స్టేషన్ ప్లాట్‌ఫాం పైకి రైలు రాగా, ఈ ప్రమాదం జరిగింది. అయితే తొక్కిసలాటలో ఇద్దరే గాయపడ్డారని రైల్వే అధికారులు తెలిపారు. పెద్ద సంఖ్యలో ప్రయాణికులు రావడంతో ఈ తొక్కిసలాట చోటుచేసుకుందని రైల్వే అధికారి ఒకరు చెప్పారు. గాయపడిన వారిని దవాఖానలకు తరలించినట్టు పశ్చిమ రైల్వే తెలిపింది.
రైల్వే మంత్రి అసమర్థుడు
బాంద్రా ప్రమాదంపై రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌పై విపక్షాలు తీవ్రంగా దుమ్మెత్తిపోశాయి. ఇలాంటి అసమర్థ వ్యక్తి రైల్వే మంత్రిగా ఉండటం దేశానికి అవమానకరమని శివసేన (యూబీటీ) నేత ఆదిత్య ఠాక్రే మండిపడ్డారు.‘ రైల్వే మంత్రి నిత్యం బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు జపమే చేస్తారు. సౌకర్యాల లేమితో పేదల ప్రాణాలు పోతున్నా ఆయనకు పట్టదు’ అని శివసేన (యూబీటీ) ఎంపీ సంజయ్ రౌత్ విమర్శించారు.
ప్లాట్‌ఫాం టికెట్ల అమ్మకంపై ఆంక్షలు
బాంద్రా రైల్వే స్టేషన్లో ప్రమాదాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రయాణికుల రద్దీని నివారించడానికి ముంబైలోని పలు ప్రధాన స్టేషన్లలో ప్లాట్‌ఫాం టికెట్ల విక్రయాలపై తాత్కాలికంగా ఆంక్షలు విధించారు. ఛత్రపతి శివాజీ మహరాజ్ టెర్మినస్, దాదర్, కుర్లా ఎల్టీటీ, థాణే, కల్యాణ్, పుణె, నాగ్‌పూర్ స్టేషన్లలో ఈ ఆంక్షలు తక్షణం అమలులోకి వస్తాయని రైల్వే ఉన్నతాధికారులు తెలిపారు.