Deers killed : భద్రతా లోపం కారణంగా కేరళ (Kerala) రాష్ట్రం త్రిసూర్ (Thrissur) నగరంలో నూతనంగా ప్రారంభమైన పుతూర్ జూపార్కు (Puthur Zoo park) లో దారుణం జరిగింది. వీధి కుక్కలు వేటాడి 10 దుప్పుల (Deers) ను చంపేశాయి. జూపార్కు ప్రారంభమై నెల రోజులైనా పూర్తికాకముందే ఇలాంటి ఘటన చోటుచేసుకోవడంతో స్థానికంగా చర్చనీయాంశమైంది.
దుప్పల మృతి నేపథ్యంలో అటవీశాఖకు చెందిన అధికారులు జూపార్కుకు చేరుకుని తనిఖీలు నిర్వహించారు. కళేబరాలకు పోస్టుమార్టం పూర్తయిన తర్వాత మాత్రమే దుప్పుల మరణానికి కచ్చితమైన కారణాలను చెప్పగలమని అన్నారు. వీధి కుక్కల దాడిలో దుప్పుల మరణంపై జూ డైరెక్టర్ నాగరాజ్‌ను ఫోన్ సంప్రదించగా.. స్పందించేందుకు ఆయన నిరాకరించారు.
కాగా పుతూర్ జూపార్కు సందర్శన కోసం ప్రజలకు ఇంకా అనుమతి ఇవ్వలేదు. ప్రస్తుతం కేవలం స్కూళ్లు, కాలేజీల గ్రూపులకు మాత్రమే అనుమతి ఇస్తున్నారు. అయితే ప్రజా సందర్శనకు అనుమతించే తేదీని త్వరలో ప్రకటించనున్నారు. కాగా ఈ జూ దేశంలోనే రెండో అతిపెద్ద జూగా, దేశంలోనే అతిపెద్ద డిజైనర్ జూగా గుర్తింపు పొందింది.
కాగా పుతూర్ జూపార్కును కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ అక్టోబర్ 28న ప్రారంభించారు. మొత్తం 80 జాతులకు చెందిన 534 జంతువులను ఆవాసం కల్పించేలా ఈ జూను డిజైన్ చేశారు. ఇందులో 23 సహజ ఎన్‌క్లోజర్స్ ఉన్నాయి. ప్రస్తుతం ఉన్న త్రిసూర్ జూ నుంచి జంతువులను పుతూర్ జూకు తరలిస్తున్నారు.