Uttarkashi Cloudburst | ఉత్తరఖాండ్‌లోని ఉత్తరకాశీలో వచ్చిన ఆకస్మిక వరదల కారణంగా ధరాలీలోని హర్సిల్ ఆర్మీ బేస్ క్యాంప్ కొట్టుకుపోయింది. దీంతో జేసీవో సహా 10 మంది ఆర్మీ జవాన్లు గల్లంతయ్యారు. ఇదిలా ఉంటే ఈ వరదల్లో మునిగి ఐదుగురు చనిపోయారు. దాదాపు 50 మంది పౌరులు గల్లంతయ్యారు.
క్లౌడ్ బరస్ట్ కారణంగా ఉత్తర కాశీ జిల్లాలోని కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా మంగళవారం ఉదయం ఖీర్ గంగా నది ఒక్కసారిగా విరుచుకుపడి ఆకస్మిక వరదలు సంభవించాయి. వరద ప్రవాహం కారణంగా ధరాలీ గ్రామంలోని వందలాది ఇళ్లు ధ్వంసమయ్యాయి. హోటళ్లు, దుకాణాలు నదిలో కొట్టుకుపోయాయి. 60 మందికి పైగా వరదల్లో కొట్టుకుపోయారనే సమాచారం అందుకున్న ఆర్మీ, ఐటీబీపీ, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగి వరద ప్రభావ ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టాయి. పలువురిని రక్షించాయి. కాగా, ఇప్పటివరకు ఐదుగురి మృతదేహాలను వెలికి తీసినట్లు అధికారులు తెలిపారు.
Uttarkashi2
ఇదిలా ఉంటే.. ఉత్తర కాశీలోని వరదలపై ప్రధాని మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఉత్తరకాశీలోని ధరాలీ గ్రామాన్ని వరదలు ముంచెత్తడం విచారకరం, బాధితులంతా క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నానని తెలిపారు. అలాగే ఉత్తరఖాండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామీకి ఫోన్ చేసిన ఆయన.. సహాయక చర్యల గురించి అడిగి తెలుసుకున్నారు.
Uttarkashi3