VIP Darshan | అయోధ్య బాల రామయ్య ఆలయానికి భక్తులు పోటెత్తుతున్నారు. ఇదే అదునుగా పలువురు అక్రమార్కులు దర్శనాల పేరుతో మోసాలకు పాల్పడుతున్నారు. వీఐపీ దర్శనం కల్పిస్తామని చెప్పి ఓ కుటుంబానికి రూ.1.80లక్షలు టోకరా వేశాడో మోసగాడు. సదరు వ్యక్తిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. మహారాష్ట్రలోని థానేలోని దీన్ దయాళ్ నగర్‌కు చెందిన కవితా శెట్టి అయోధ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. సురేశ్ ఆచార్య అనే తనను కార్యాలయంలో కలిసేందుకు వచ్చాడని.. అతను తన కల్లి కస్తూరి శెట్టిని కలిసి.. ఆమెను అయోధ్య యాత్రకు ఆహ్వానించినట్లుగా పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.
తాను కర్ణాటక డిప్యూటీ స్పీకర్ దగ్గర ఉంటానని.. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్నేహితుడని.. అయోధ్యలో దర్శనం కోసం వీఐపీ పాస్ ఇప్పిస్తానని నమ్మబలికాడు. దాని కోసం రూ.1.80లక్షలు తీసుకున్నాడు. అయోధ్యకు చేరిన తర్వాత అతని వద్ద ఎలాంటి పాస్ లేదని తేలిందని.. మోసగాడిగా గుర్తించారు. తండ్రి సురేష్ డబ్బు గురించి అడిగితే.. బెదిరింపులకు పాల్పడ్డాడని.. డ్రైవర్ అంకిత్‌ను సైతం బెదిరించినట్లుగా పేర్కొన్నారు. ఈ మేరకు అయోధ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడిని కర్ణాటకలోని బెంగళూరు వాసిగా గుర్తించామని.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు కొత్వాల్ మనోజ్ శర్మ తెలిపారు.