ప్రయాగ్‌రాజ్: ప్రపంచంలోనే అతి పెద్ద ఆధ్యాత్మిక ఉత్సవంగా పేరు గాంచిన మహా కుంభ మేళా 144 ఏండ్ల తర్వాత సోమవారం అత్యంత వైభవంగా ప్రారంభమైంది. తొలి రోజైన పుష్య మాస పౌర్ణమినాడు ఉత్తర ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌కు భక్తులు పోటెత్తారు. గంగ, యమున, సరస్వతి నదుల సంగమ ప్రదేశంలో మొదటి రోజే 1.6 కోట్ల మంది పవిత్ర స్నానాలు చేసి ఉంటారని అంచనా వేస్తున్నారు. తెల్లవారుజాము నుంచే భక్తుల పూజలతో స్నాన ఘట్టాల ప్రాంతమంతా భక్తుల దైవ నామస్మరణలతో మారుమోగింది.
మహా కుంభ్ ప్రారంభోత్సవం సందర్భంగా భారతీయ సంస్కృతి, విలువలను గౌరవించే కోట్లాది మందికి ఇది అత్యంత ప్రత్యేకమైన రోజు అని ప్రధాని నరేంద్ర మోదీ ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. భక్తి, విశ్వాసం, సంప్రదాయాలు అనేక మందిని ఒక చోట చేర్చాయన్నారు. మన దేశ ఆధ్యాత్మిక వారసత్వాన్ని ఈ వేడుక ప్రతిబింబిస్తుందని చెప్పారు. మహా కుంభ మేళాలో విదేశీయులు కూడా పవిత్ర స్నానాలు చేశారు.
నదిలో దిగి పవిత్ర స్నానాలు చేసే భక్తులకు నిరంతరం భద్రత కల్పించేందుకు నీటిలో తేలియాడే పోలీస్ స్టేషన్‌ను ఏర్పాటు చేశారు. అంతేకాకుండా చిన్న పడవలపై పోలీసులు ఎల్లవేళలా పహారా కాస్తున్నారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, యూపీ పోలీసులకు చెందిన వాటర్ పోలీసు యూనిట్లు విధులు నిర్వహిస్తున్నాయి.మహా కుంభ మేళా ప్రారంభం రోజున పవిత్ర స్నానాలను ఆచరించిన సాధు, సంతులు, భక్తులకు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ధన్యవాదాలు తెలిపారు. తొలి రోజున కోటిన్నర మంది భక్తులు పవిత్ర స్నానాలు చేశారని ఎక్స్ వేదికగా ఆయన ప్రకటించారు.
పవిత్ర స్నానాల కోసం భారీగా భక్తులు తరలిరావడంతో, సుమారు 250 మంది తమ కుటుంబ సభ్యుల నుంచి వేరైపోయారు. పోలీసులు, సివిల్ డిఫెన్స్ సిబ్బంది చురుగ్గా స్పందించడంతో వీరంతా తిరిగి తమ కుటుంబ సభ్యులను కలుసుకున్నారని అధికారులు చెప్పారు.
ఈ మేళాలోని 25 సెక్టార్లలో ఉన్న విద్యుత్తు స్తంభాలపై 50 వేలకుపైగా క్యూఆర్ కోడ్లను ఏర్పాటు చేశారు. భక్తులు తాము ఏ ప్రదేశంలో ఉన్నామో తెలుసుకునేందుకు ఇవి ఉపయోగపడతాయి. కుంభ మేళాను గగనతలం నుంచి వీక్షించేందుకు హెలికాప్టర్ జాయ్‌రైడ్‌ను ఏర్పాటు చేశారు. టిక్కెట్ ధర ఒక్కొక్క వ్యక్తికి రూ.1,296గా నిర్ణయించారు.
మాజీ సీఎం ములాయం సింగ్ యాదవ్ విగ్రహాన్ని యులాయం సింగ్ యాదవ్ స్మృతి సేవా సంస్థాన్ మహా కుంభ మేళాలోని సెక్టర్ 16లో ఏర్పాటు చేసింది. అయితే దీనిపై సాధువుల నుంచి విమర్శలు వస్తున్నాయి.
మహా కుంభ మేళా ఉత్తర ప్రదేశ్‌కు కనకవర్షం కురిపిస్తున్నది. 45 రోజులపాటు జరిగే ఈ మేళాకు 45 కోట్ల మ ంది భక్తులు హాజరవుతారని అంచనా. అయితే 40 కోట్ల మంది మాత్రమే వచ్చి, సగటున రూ.5,000 ఖర్చు చేస్తే, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు రూ.2 లక్షల కోట్లు సమకూరుతాయని సమాచారం.