న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు అంటే సీజేఐ మాత్రమే నడిపిస్తారన్న భావన ఉన్నదని, అది మారాలని సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ అన్నారు. సుప్రీంకోర్టు జడ్జిలుగా నియమితులైన 8 మందికి సుప్రీంకోర్ట్ బార్ అసోసియేషన్ ఈ నెల 12న ఏర్పాటు చేసిన స్వాగత సభలో సీజేఐ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జడ్జిలందరూ ఒకే రకమైన న్యాయ విధులు నిర్వర్తిస్తారన్నారు. సీజేఐ సమానుల్లో ప్రథముడు మాత్రమేనన్నారు. సుప్రీం కోర్టులోని చివరి జడ్జి కూడా కోర్టుకు ‘గార్డ్ బాబు (కాపాలా కాసే వ్యక్తి)’గా ఉండాలని కోరారు. మన దేశంలో, సుప్రీం కోర్టు ధర్మాసనాల్లో ఎన్నో విభిన్నతలున్నా ఏకత్వం ప్రతిఫలిస్తున్నదన్నారు. వివిధ అంశాల కేసుల విచారణకు సుప్రీం కోర్టులో ప్రత్యేక ధర్మాసనాలు ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ-కోర్టుల ఏర్పాటు, వాదనల ప్రత్యక్ష ప్రసారం లాంటి కీలక సంస్కరణలను అమలు చేస్తున్నామని పేర్కొన్నారు.