న్యూఢిల్లీ, ఏప్రిల్ 24: అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌నకు ప్రధాని మోదీ తలొగ్గారా? అమెరికా కోసం దేశ ప్రయోజనాలను సైతం తాకట్టుపెట్టారా? స్వయంగా బీజేపీ సీనియర్ నాయకుడు రామ్ మాధవ్ తాజాగా చేసిన వ్యాఖ్యలు ఇందుకు బలాన్ని చేకూరుస్తున్నాయి. అమెరికా ప్రభుత్వం తమ ప్రయత్నాలను గుర్తించనప్పటికీ ఇరాన్, రష్యా నుంచి చమురు కొనుగోళ్లను నిలిపివేయడం ద్వారా అమెరికా ప్రయోజనాలకు భారత్ దగ్గరగా నిలిచిందంటూ రామ్ మాధవ్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. న్యూయార్క్‌లోని హడ్సన్ ఇన్స్టిట్యూట్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ చేసిన ఈ వ్యాఖ్యలు విపక్ష కాంగ్రెస్ పార్టీకి కొత్త ఆయుధాన్ని ఇచ్చాయి. మోదీ ప్రభుత్వం కీలక జాతీయ ప్రయోజనాల విషయంలో ట్రంప్ ప్రభుత్వానికి లొంగిపోయిందంటూ కాంగ్రెస్ ఆరోపించింది. వివాదం ముదిరిపోవడంతో మాధవ్ తన వ్యాఖ్యలో తప్పులున్నాయని పేర్కొంటూ అందుకు క్షమాపణ చెప్పారు.
ప్రతిపక్షాల ఒత్తిడి ఉన్నప్పటికీ సుంకాలు, ఇంధన దిగుమతులు వంటి కీలక అంశాలపై భారత్ అమెరికా విధానాలకు అనుగుణంగా వ్యవహరించిందన్న రామ్ మాధవ్ వాదనే ఈ వివాదానికి కేంద్ర బిందువుగా నిలిచింది. ఇరాన్ నుంచి చమురు కొనుగోలును నిలిపివేయడానికి భారత్ అంగీకరించింది. ప్రతిపక్షం నుంచి తీవ్ర విమర్శలు ఉన్నప్పటికీ రష్యా నుంచి చమురు కొనుగోలును నిలిపివేయడానికి భారత్ ఒప్పుకుంది. గట్టిగా ఎదురుచెప్పకుండా 50% సుంకాన్ని కూడా భారత్ అంగీకరించింది. ఇక అమెరికాతో కలసి పనిచేయకపోవడానికి భారత్ సరిగ్గా ఏ విషయంలో వెనుకబడి ఉంది? అని రామ్ మాధవ్ ప్రశ్నించారు. ప్యానెల్ డిస్కషన్లో మాజీ దౌత్యవేత్త ఎలిజబెత్ త్రెల్కెల్డ్, మాజీ అమెరికా విదేశాంగ శాఖ ఉప మంత్రి కర్ట్ క్యాంప్‌బెల్ కూడా ఉన్నారు. రష్యా, ఇరాన్ వంటి అమెరికా వ్యతిరేక దేశాలతో భారత్ వ్యవహరించిన తీరుపై ట్రంప్ వ్యక్తం చేసిన అభిప్రాయాలకు తాము ఎలా సర్దుకుపోయిందో మాధవ్ వివరించారు. అమెరికా ఆంక్షలు విధించిన తర్వాత 2019లో భారత్ ఇరాన్ చమురు కొనుగోలును నిలిపివేసింది. నిరుడు రష్యా చమురు కొనుగోలు కూడా ఒక ప్రధాన వివాదాంశంగా మారింది. ఉక్రెయిన్‌కు వ్యతిరేకంగా మాస్కో యుద్ధ యంత్రాంగానికి భారత్ రష్యా చమురు కొనుగోలు ద్వారా నిధులు సమకూరుస్తున్నదని అమెరికా ఆరోపించింది. భారతదేశ దిగుమతులపై ట్రంప్ 50% సుంకాన్ని విధించడంతో సంబంధాలు కనిష్ఠ స్థాయికి దిగజారాయి. ఇంత జరిగినప్పటికీ భారత్ మాత్రం ఆచితూచి వ్యవహరించిందే తప్ప ట్రంప్‌పై మాటల దాడి చేయలేదు. రహస్య దౌత్య సంబంధాలను కొనసాగించింది. రష్యా చమురు దిగుమతులను భారత్ తగ్గించినప్పటికీ వాటిని పూర్తిగా నిలిపివేయలేదు. అయితే ఫిబ్రవరిలో ట్రంప్ సుంకాలను 18 శాతానికి తగ్గించడంతో భారత్, అమెరికా వాణిజ్య ఒప్పందానికి వచ్చిన తర్వాత సంబంధాలు మెరుగుపడ్డాయి.
రామ్ మాధవ్ వ్యాఖ్యలు మోదీ ప్రభుత్వంపై విరుచుకుపడేందుకు కాంగ్రెస్‌కు కొత్త ఆయుధాన్ని అందజేశాయి. ట్రంప్ ప్రభుత్వాన్ని ప్రసన్నం చేసుకునేందుకు దేశ ప్రయోజనాల విషయంలో ప్రభుత్వం రాజీ పడిందని కాంగ్రెస్ ఆరోపించింది. నరేంద్ర మోదీ లొంగుబాటు విధానం ఇక్కడ బట్టబయలైంది. బీజేపీ, ఆర్ఎస్ఎస్ నాయకుడు రామ్ మాధవ్ మోదీ ప్రభుత్వపు బుజ్జగింపు విధానాన్ని సమర్థిస్తూ ‘విశ్వగురు’ వినాశకరమైన విదేశాంగ విధానాన్ని బట్టబయలు చేస్తున్నారు. ఒకప్పుడు బ్రిటిష్ వారికి బానిసలైన ఆర్ఎస్ఎస్ ఇప్పుడు అమెరికాకు బానిస కావాలనుకుంటున్నది అంటూ కాంగ్రెస్ ఎక్స్‌లో ఆగ్రహం వ్యక్తం చేసింది. వివాదం చేయిజారిపోవడంతో తన తప్పు గ్రహించిన రామ్ మాధవ్ వెంటనే క్షమాపణ చెప్పారు. తన ప్రకటనలో తప్పులున్నట్లు ఆయన ఒప్పుకున్నారు. నేను చెప్పింది తప్పు. రష్యా నుంచి చమురు దిగుమతులు ఆపడానికి భారత్ ఎప్పుడూ అంగీకరించలేదు. అలాగే, 50% సుంకం విధించడాన్ని తీవ్రంగా నిరసించింది. నేను పరిమితంగానే ప్రతివాదన చేయడానికి ప్రయత్నించాను. కానీ అది వాస్తవానికి తప్పు. క్షమించండి అని మాధవ్ తెలిపారు.