చెన్నై, ఏప్రిల్ 11: శాసనసభ ఆమోదించిన బిల్లులపై గవర్నర్ నిర్ణీత కాలంలో నిర్ణయం తీసుకోవాలంటూ తమిళనాడు చేసిన తీర్మానాల్ని, బీజేపీయేతర రాష్ర్టాల సీఎంలు కూడా చేపట్టాలని తమిళనాడు సీఎం స్టాలిన్ కోరారు. ఆయా రాష్ర్టాల సీఎంలకు, ప్రతిపక్ష పార్టీల నేతలకు లేఖలు రాశారు. ప్రజాస్వామ్యం నాలుగురోడ్ల కూడలిలో నిలబడిందని, కేంద్రం తీరుతో సహకార సమాఖ్యవాదం కనుమరుగవుతున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్రం, గవర్నర్, రాష్ట్రప్రభుత్వం బాధ్యతలు, అధికారాల్ని రాజ్యాంగంలో స్పష్టంగా పేర్కొన్నారని, ఇవన్నీ నేడు కాలపరీక్షను ఎదుర్కొంటున్నాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వ పాలనను ప్రభావితం చేస్తున్నారని, కొంతమంది గవర్నర్లు ఉద్దేశపూర్వకంగా బిల్లులను పెండింగ్లో పెడుతున్నారని ఆరోపించారు. అనేక రాష్ర్టాల్లోనూ ఇదే సమస్య నెలకొన్నదని, బిల్లులను నిర్ణీత కాలంలో గవర్నర్లు ఆమోదించటంపై తమిళనాడు శాసనసభ చేసిన తీర్మానాన్ని బీజేపీయేతర సీఎంలు చేపట్టాలని లేఖలో కోరారు.