నకిరేకల్, అక్టోబర్ 26 : నకిరేకల్ ఎంపీపీ బచ్చుపల్లి శ్రీదేవీగంగాధర్రావుకు బీఆర్ఎస్ సభ్యత్వం లేదని, ఉంటే పార్టీ సభ్యత్వం ప్రజలకు చూయించాలని, మూడేండ్లుగా పార్టీ, అధికారిక కార్యక్రమాలకు దూరంగా ఉన్నది నిజం కాదా? అని నకిరేకల్ జడ్పీటీసీ మాద ధనలక్ష్మీనగేశ్గౌడ్ ప్రశ్నించారు. ఎంపీపీ రాజీనామా లేఖలో ఎమ్మెల్యే చిరుమర్తిపై పేర్కొన్న అసత్య ఆరోపణలు ఖండిస్తూ నకిరేకల్ బీఆర్ఎస్ కార్యాలయంలో గురువారం విలేకరుల సమావేశం నిర్వహించారు.
ఈ సందర్బంగా జడ్పీటీసీ మాట్లాడుతూ నకిరేకల్ ప్రజలకు అందుబాటులో లేరని, ఎమ్మెల్యేపై నిరాదరణ ఆరోపణలు ఖండిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. మున్సిపల్ చైర్మన్ రాచకొండ శ్రీనివాస్ మాట్లాడుతూ ఎంపీపీ సొంత లాభం కోసం పార్టీ మారుతూ, కన్నతల్లి లాంటి బీఆర్ఎస్ను అవమానపరుస్తున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ కార్యక్రమాలు, అధికార కార్యక్రమాల్లో మూడేండ్లుగా పాల్గొనడం లేదని, అలాంటప్పుడు ఎమ్మెల్యే ఎలా కక్ష సాధింపు చర్యలు గురిచేస్తారన్నారు.
ఎంపీపీ అవడానికి ఎమ్మెల్యే చిరుమర్తి కృషి చేశారని, అలాంటి వ్యక్తిపై అసత్య ఆరోపణలు చేయడాన్ని ఖండిస్తున్నట్లు తెలిపారు. పీఏసీఎఎస్ చైర్మన్ పల్రెడ్డి మహేందర్రెడ్డి మాట్లాడుతూ ఎమ్మెల్యే ప్రొటోకాల్ పాటించకుండా ఇబ్బందులకు గురిచేసిండు అనడం సమంజసమని ప్రశ్నించారు. ఎంపీపీ అయిన దగ్గర నుంచి ఏ ఒక్క రోజు ఎమ్మెల్యే దగ్గరకు వచ్చింది లేదని, ఎమ్మెల్యేను విమర్శించడం మానుకోవాలన్నారు. ఈ సమావేశంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ సోమ యాదగిరి, మాజీ ఎంపీటీసీ రాచకొండ వెంకన్న, బీఆర్ఎస్ నాయకులు పెండెం సదానందం, కృష్ణమూర్తి, జాఫర్ పాల్గొన్నారు.