నకిరేకల్/శాలిగౌరారం, అక్టోబర్ 27 : కాంగ్రెస్ నాయకుల అత్యుత్సాహం ఒక యువకుడి ప్రాణాలను బలి తీసుకున్నది. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న మూసీ ప్రక్షాళనకు మద్దతు కోరుతూ తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ ఆధ్వర్యంలో ఆదివారం రైతు సమ్మేళనం ఏర్పాటుచేశారు. అందుకోసం శాలిగౌరారం మండలంలోని గురజాల-మనాయికుంట వద్ద మూసీ బ్రిడ్జిపై రోడ్డుకు సగం వరకూ కాంగ్రెస్ నాయకులు శనివారం రాత్రి సభా వేదికను కట్టారు. ఎక్కడా హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయలేదు. బ్రిడ్జిపై కనీసం లైట్లు కూడా లేవు. రాత్రి 8గంటల సమయంలో సూర్యాపేట జిల్లా కుడకుడకు చెందిన తూర్పాటి చరణ్(17) చరణ్ తల్లిదండ్రుల మెడిసిన్ కోసం బైక్‌పై మనాయికుంట గ్రామానికి వెళ్తూ మూసీ బ్రిడ్జిపై స్టేజీని కనిపించకపోవడంతో స్టేజీకి కట్టిన ఇనుప రాడ్లను ఢీకొని అక్కడికక్కడే మృతి చెందాడు. తెల్లవారితే సభ జరుగాల్సిన ప్రదేశంలో రక్తపు మరకలు పేరుకుపోవడంతో భయపడిన కాంగ్రెస్ నాయకులు రాత్రికి రాత్రే వేదికను తొలగించారు. శాలిగౌరారం పోలీసులు యువకుడి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నకిరేకల్ ఏరియా దవాఖానకు తరలించారు. కాంగ్రెస్ నేతల అత్యుత్సాహంతో చరణ్ ప్రాణం వదలగా.. ఆ తర్వాత పోలీసులు మరింత కర్కషంగా వ్యవహరించారని బాధిత కుటుంబం బోరున విలపిస్తున్నది. ఆదివారం కాంగ్రెస్ సభకు భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, ఎమ్మెల్యేలు మందుల సామేల్, వేముల వీరేశం హాజరయ్యారు. చెట్టంత బిడ్డను కోల్పోయి తీవ్ర ఆవేదనలో ఉన్న బాధిత కుటుంబం సభ వద్దకు వచ్చి ఎక్కడ నిరసన తెలుపుతుందోనని భయపడిన కాంగ్రెస్ నేతలు పోలీసులను అడ్డం పెట్టుకుని తమను తీవ్ర ఇబ్బందులు పాలుజేశారని చరణ్ బంధువులు వాపోయారు. శనివారం రాత్రి చరణ్ మృతదేహాన్ని నకిరేకల్ ఏరియా హాస్పిటల్‌లోని మార్చురీలో పెట్టి తాళం వేసిన ఆదివారం రాత్రి వరకూ బాధిత కుటుంబానికి చూపించకపోవడం, పోస్టుమార్టం చేయించి అప్పగించకపోవడం తీవ్ర అవమానీయంగా మిగిలింది.
చరణ్ మృతదేహాన్ని మార్చురీలో ఉంచి తాళం వేసిన పోలీసులు ఆపై బాధిత కుటుంబం ఆందోళనకు దిగకుండా కాంగ్రెస్ నేతల తరఫున బేరసారాల బాధ్యత తీసుకున్నారు. ఆదివారం ఉదయం 10 గంటలు దాటినా పోస్ట్‌మార్టం చేయకపోవడతో బాధిత కుటుంబం తరఫున బంధువులు నకిరేకల్ ప్రభుత్వాసుపత్రి ఎదుట చరణ్ బంధువులు ధర్నాకు దిగారు. ఈ క్రమంలో పోలీసులు, వారికి మధ్య స్వల్ఫ ఘర్షణ చోటుచేసుకుంది. సభ సాఫీగా సాగాలన్న ఉద్దేశంతో కాంగ్రెస్ నేతలు నష్టపరిహారం ఇస్తామంటూ శవ రాజకీయం చేశారు. పరిహారం ఇప్పిస్తామంటూ పోలీసులు చరణ్ తండ్రి సైదులు, మరో ముగ్గురు పెద్ద మనుషులను శాలిగౌరారం స్టేషన్‌కు తీసుకువెళ్లారని ఆమె తల్లి వాపోయారు. ఎంతకీ పోస్ట్‌మార్టం చేయకపోవడతో ఒక దశతో చరణ్ బంధువులు మృతదేహాన్ని తీసుకొచ్చేందుకు మార్చరీ గేటు ఎక్కేందుకు ప్రయత్నించగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. ‘మీ వాళ్లతో మాట్లాడుతున్నారు. న్యాయం చేస్తాం. ఓపిక పట్టండి’ అంటూ నచ్చజెప్పే ప్రయత్నం చేయగా, మరోమారు వాగ్వాదం జరిగింది. ‘రోడ్డు మధ్యలో సభ ఎవరు పెట్టమన్నారు. లైట్లు ఎందుకు వేయలేదు. లైట్లు వేసి ఉంటే చరణ్ బతికుండేవాడు. మార్చురీకి తాళం ఎందుకు వేశారు. 24గంటలైనా పోస్ట్‌మార్టం ఎందుకు చేయరు’ అని ప్రశ్నించగా.. సమాధానం చెప్పలేక పోలీసులు సతమతమయ్యారు. కాంగ్రెస్ మీటింగ్ దగ్గరికి చరణ్ మృతదేహాన్ని తీసుకువెళ్లి ఆందోళన చేస్తామనే పోస్ట్‌మార్టం ఆపేశారని బాధిత కుటుంబం వాపోతున్నది. కాంగ్రెస్ పార్టీ నాయకులు చరణ్ కుటుంబ సభ్యులతో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తుండగా, ఆదివారం అర్ధరాత్రి వరకు కూడా మృతదేహానికి పోస్ట్‌మార్టం జరుగలేదు. ఈ విషయమై ఆస్పత్రి సిబ్బంది, పోలీసులు పొంతనలేని సమాధానాలు చెబుతున్నారు. శాలిగౌరారం సీఐ కొండల్‌రెడ్డిని వివరణ కోరగా చరణ్ మృతదేహానికి ఆదివారం రాత్రి గానీ సోమవారం ఉదయం గానీ పోస్టుమార్టం చేయించి బంధువులకు అప్పగిస్తామన్నారు.
‘ఎమ్మెల్యేనే నా కొడుకును చంపించిండు. లైట్లు వేసుంటే బతికుండేటోడు. మీటింగ్ ఉన్నదని పోస్టుమార్టమ్ చెయ్యటేరు. నా కొడుకును సూడక 24 గంటలైంది. న్యాయం చేస్తమని నా మొగుణ్ని ముగ్గురు పెద్దమనుషులను తీసుకపోయిండ్రు. ఇప్పటి వరకు జాడలేదు. మీకు దండం పెడతా. నా కొడకును నాకు చూపించండి.’ అంటూ చరణ్ తల్లి గంగమ్మ బోరుబోరున విలపించింది. శనివారం రాత్రి చనిపోయిన కొడుకును ఆదివారం రాత్రి అయినా చూపించకపోవడంతో ఆ తల్లి ఎంతో తల్లడిల్లింది.