నల్లగొండ రూరల్, మే 7 : ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే యువతకు ఎల్లవేళలా గుత్తా వెంకట్‌రెడ్డి మెమోరియల్ ట్రస్ట్ అండగా ఉంటుందని ట్రస్ట్ చైర్మన్ గుత్తా అమిత్‌రెడ్డి స్పష్టం చేశారు. కాంపిటేటివ్ పరీక్షలకు ప్రిపేరయ్యే విద్యార్థుల కోసం నల్లగొండ యువతరం యాప్‌ను ఆదివారం ఎంజీయూ వీసీ సీహెచ్ గోపాల్‌రెడ్డి జిల్లా కేంద్రంలోని టీఎన్జీఓ భవన్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అమిత్‌రెడ్డి మాట్లాడుతూ గూగుల్ ప్లేస్టోర్ నుంచి ఈ యాప్ డౌన్లోడ్ చేసుకొని రిజిస్ట్రేషన్ చేసుకుంటే.. నయా పైసా ఖర్చు లేకుండా ఇంట్లోనే ఉండి ఏడాదిపాటు ఉచితంగా ఆన్లైన్లో క్లాసులు వినవచ్చన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాలు భర్తీ చేస్తున్న తరుణంలో ఈ యాప్‌ను సద్వినియోగం చేసుకొని ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాలని ఆకాంక్షించారు.
ఎంజీయూ వీసీ గోపాల్‌రెడ్డి మాట్లాడుతూ కోచింగ్‌కు వెళ్లలేని గ్రామీణ విద్యార్థుల కోసం నల్లగొండ యువతరం యాప్‌ను తీసుకొచ్చిన అమిత్‌రెడ్డిని అభినందించారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు ఉపయోగించుకోవాలన్నారు. యాప్ రూపకర్త చక్రవర్తి మాట్లాడుతూ నల్లగొండ యువతరం యాప్‌లో 57 రకాల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ పోటీ పరీక్షలతో పాటు రాష్ట్రస్థాయి కాంపిటేటివ్ పరీక్షలకు ఉపయోగపడే వీడియో క్లాసులు ఉన్నట్లు తెలిపారు. ఇంగ్లిష్, తెలుగు భాషల్లో ఆన్లైన్ క్లాసులు అందుబాటులో ఉంటాయన్నారు. కార్యక్రమంలో టీఎన్జీఓ జిల్లా అధ్యక్షుడు శ్రవణ్‌కుమార్, ఆర్యవైశ్యుల సంఘం జిల్లా అధ్యక్షుడు వనం వెంకటేశ్వర్లు, యామ దయాకర్, అయితగోని స్వామిగౌడ్, బీఆర్ఎస్ మైనార్టీ నాయకుడు బషీరొద్దీన్, కంచరకుంట్ల గోపాల్‌రెడ్డి, హరికృష్ణ, ఫ్యాకల్టీ శ్రీనివాస్, చక్రవర్తి పాల్గొన్నారు.