యాదగిరిగుట్ట, డిసెంబర్ 22 : కాంగ్రెస్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్యకు తన పార్టీలోనే వ్యతిరేకత పెరిగింది. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే ఆయన తీరుపై ఆ పార్టీకి చెందిన కొంత మంది యూత్ విభాగం నాయకులు తీవ్రంగా ఆక్షేపిస్తున్నారు. పార్టీ క్యాడర్లో విభేదించి పరిగణించడం, గ్రామాల్లో వర్గాలుగా విభజించి పార్టీ కోసం అహర్నిశలు కష్టపడుతున్న నాయకత్వాన్ని తక్కువ చూడటం, నూతనంగా పార్టీలోకి వచ్చిన వ్యక్తులను అందలం ఎక్కించడం లాంటి వాటిపై యూత్ విభాగం నాయకులు ఎమ్మెల్యేపై గుర్రుగా ఉన్నారు. కొంత మంది సీనియర్ నాయకులు అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధమయ్యారు. ఇందుకు మోటకొండూర్ మండల కేంద్రంలో ఆదివారం నూతనంగా ఎన్నికైన మండల యూత్ కాంగ్రెస్ కమిటీ సభ్యుల సన్మానం, భారీ ర్యాలీ వంటి కార్యక్రమాలు ఎమ్మెల్యేపై ఎంత వ్యతిరేకత ఉందో కొట్టొచ్చిన్నట్లు కనిపిస్తున్నాయి. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే బీర్ల అయిలయ్యకు ఆహ్వానం లేకపోవడం, ఫ్లెక్సీలో ఆయన ఫొటో సైతం లేకుండా ముగించారు. ఈ కార్యక్రమాన్ని ఆ పార్టీ మోటకొండూర్ కాంగ్రెస్ మండల పార్టీ మాజీ అధ్యక్షుడు శిరబోయిన మల్లేశ్ యాదవ్ ఆధ్వర్యంలో చేపట్టారు.
ఈ కార్యక్రమం ద్వారా స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎమ్మెల్యే ప్రకటించిన అభ్యర్థులను ఓడించేందుకు సైతం వెనుకాడటం లేదని తెలుస్తున్నది. ఇటీవల మోత్కూరు మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి గెలుపుకోసం కష్టపడ్డవారిని సైతం పక్కనబెట్టి ప్యారాచూట్ నాయకుడికి కట్టబెట్టడంపై గుండాల మండల కాంగ్రెస్ నాయకులు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య తీరు సరైంది కాదని కరపత్రాన్ని విడుదల చేశారు.
యువజన కాంగ్రెస్ ఎన్నికల్లో బీర్ల అయిలయ్యకు చుక్కెదురు..
ఇటీవల యూత్ కాంగ్రెస్ ఎన్నికలను ఆన్లైన్లో నిర్వహించారు. పారదర్శకంగా నిర్వహించిన ఈ ఎన్నికల్లో ఎమ్మెల్యే బీర్ల అయిలయ్యకు చుక్కెదురైంది. జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా బొమ్మలరామారం మండలానికి చెందిన నందరాజుగౌడ్ను ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య పోటీకి దింపారు. ఈయనకు వ్యతిరేకంగా భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి వర్గానికి చెందిన భువనగిరి మండలంలోని చీమలకొండూర్ గ్రామానికి చెందిన మంగ ప్రవీణ్ పోటీకి దిగి విజయాన్ని సాధించారు. దీంతో జిల్లా యూత్ కాంగ్రెస్‌లో బీర్లకు ప్రాధాన్యత తగ్గినట్లయ్యింది. దీంతోపాటు ఆలేరు నియోజకవర్గంలో 8 మండలాల్లో సైతం తన ప్యానల్‌తో యూత్ విభాగాన్ని చేజిక్కించుకునే ప్రయత్నంలో పూర్తిగా విఫలమైన్నట్లుగా తెలుస్తున్నది. పోటీలోకి దించిన నాయకులంతా తక్కువ మెజారిటీతో గెలుపొందారు. తన అధికార బలాన్ని వినియోగించి 8 మండలాల్లో కేవలం 5 మండలాలు మాత్రమే ఎమ్మెల్యే అనుచరులు విజయం సాధించారు.
ఇందులో ఆలేరు, బొమ్మలరామారం, మోటకొండూర్ మండలాల్లో ఆయనకు వ్యతిరేక వర్గానికి చెందిన నాయకులు గెలుపొందారు. ఇందులో అయన పలుకుబడితో ఆలేరు, బొమ్మలరామారం మండలాలకు చెందిన యూత్ కాంగ్రెస్ నాయకులను తనవైపు తిప్పుకున్నారని సమాచారం. కాగా మోటకొండూర్ మండల యూత్ కాంగ్రెస్ మాత్రం ఆయనకు వ్యతిరేకంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో మోటకొండూర్‌లో ఎమ్మెల్యే బీర్ల అయిలయ్యకు వ్యతిరేకంగా పోటీలో నిలిచి గెలిచిన జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు మంగ ప్రవీణ్, మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా గెలుపొందిన బుగ్గ శ్రీనివాస్‌తోపాటు ఆ పార్టీకి చెందిన కొంత మంది కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఆదివారం ఆ పార్టీ మోటకొండూర్ మండల పార్టీ మాజీ అధ్యక్షుడు శిరబోయిన మల్లేశ్ యాదవ్ ఆధ్వర్యంలో సన్మానం కార్యక్రమంతోపాటు భారీ ర్యాలీని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్యను ఆహ్వానించలేదు. పైగా ఆయన వర్గమని చెప్పుకునే ఇతర కాంగ్రెస్ పార్టీ నాయకులను సైతం యూత్ కాంగ్రెస్ పక్కనపెట్టింది. ఎమ్మెల్యేగా గెలిచినా ఆయనకు యూత్ విభాగం నాయకులు దాదాపు పట్టించుకునే పరిస్థితి లేదని తేలిపోయింది. మోటకొండూర్ మండల కేంద్రంలో జరిగిన యూత్ కాంగ్రెస్ ర్యాలీ, సన్మానం వంటి కార్యక్రమాలు దాదాపు ఎమ్మెల్యేకు వ్యతిరేకంగానే జరిగాయని కార్యక్రమాన్ని వీక్షించిన పలువురు గుసగుసలాడుకున్నారు.
ఎడమెహం..పెడమొహం
ఆలేరు నియోజకవర్గంలో ఎన్నికల సమయంలో ఒక్కటిగా నిలిచి గెలుపునకు కృషి చేసిన కాంగ్రెస్ పార్టీ యువజన నాయకులు ఇప్పుడు పూర్తిగా ఎడమోహం పెడమోహంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇందుకు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య అనుసరిస్తున్న తీరు ప్రధాన కారణమని కాంగ్రెస్ నాయకులు భావిస్తున్నట్లు సమాచారం. నియోజకవర్గంలో 8 మండలాల్లో ఇదే తీరు కనబడతున్నది. గతంలో పార్టీ కోసం పనిచేసిన సీనియర్ యువతను ఆయన పట్టించుకోకపోవడంతోపాటు తన సామాజిక వర్గానికి చెందిన నూతన వ్యక్తులు, బంధువులు, పార్టీకి ఎలాంటి సంబంధం లేని వ్యక్తులను అందలమెక్కిస్తున్నారన్న ఆరోపణ ప్రధానంగా వినబడుతున్నది. కరోనా సమయంలో ఆయనకు వెన్నంటి ఉన్న యువతను పూర్తిగా విస్మరించి బంధుగణానికి అధిక ప్రాధాన్యతను ఇవ్వడం పట్ల యూత్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మండిపడుతున్నారు.