నకిరేకల్, ఆగస్టు 12: ఓ మైనర్ ఐదు మండలాల్లో 14 దొంగతనాలు చేశాడు. కోర్టు జువైనల్ హోంకు పంపింది. ఎనిమిది నెలల అనంతరం విడుదలయ్యా డు. వచ్చిన తర్వాత మైనర్ బాలికతో కలిసి పట్టపగలే చోరీలు, నేరాలు పాల్పడుతుండటంతో సోమవారం పోలీసులు అరెస్టు చేశారు. నకిరేకల్ పట్టణంలోని సర్కిల్ కార్యాలయంలో మంగళవారం నల్లగొండ డీఎస్పీ శివరాంరెడ్డి నిందితుల వివరాలను విలేకర్లకు వెల్లడించారు. నకిరేకల్‌లోని చీమలగడ్డ కాలనీకి చెందిన పరడ సుమలత తన ఇంట్లోని బీరువాలో బంగారం, వెండి, కొంత నగదును గుర్తుతెలియని వ్యక్తులు దొంగిలించారని పీఎస్‌లో చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
ఈ కేసు విషయమై నల్లగొండ ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆదేశాల మేరకు డీఎస్పీ శివరాంరెడ్డి పర్యవేక్షణలో నకిరేకల్ సీఐ రాజశేఖర్ ఆధ్వర్యంలో ఎస్సై లచ్చిరెడ్డి, సిబ్బంది నాలుగు టీంలుగా ఏర్పడి దర్యాప్తు చేపట్టారు. ఉదయం 10 గంటల సమయంలో నకిరేకల్-తిప్పర్తి రోడ్డుపై చందుపట్ల స్టేజీ వద్ద తనిఖీలు చేస్తుండగా, అనుమానాస్పదంగా తిప్పర్తి వైపు నుంచి నకిరేకల్ వైపునకు వెళ్తున్న కేతేపల్లి మండలం ఇనుపాముల గ్రామానికి చెందిన ఎ-1 వల్లమళ్ల ప్రదీప్(22) అలియాస్ బంటిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించగా చోరీ వివరాలు తెలిశాయి. నిందితుడి స్వగ్రామం ఇనుపాముల.
నార్కట్‌పల్లి మండలకేంద్రంలో కూలి పనులు చేస్తున్నాడు. ప్రదీప్ మైనర్‌గా ఉన్నప్పుడు నకిరేకల్, శాలిగౌరారం, కట్టంగూర్, నార్కట్‌పల్లి, నల్లగొండ టౌన్ పోలీస్ స్టేషన్ల పరిధిలో 14 చోరీలు చేయడంతో జువైనల్ హోంకు తరలించారు. విడుదలైన తరువాత ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మైనర్ బాలికతో కలిసి చోరీలకు పాల్పడుతున్నాడు. ఇండ్లల్లో బంగారం, వెండి, నగదు, సెల్ఫోన్లు దొంగిలించి ఇద్దరూ స్కూటీపై పారిపోయేవారు. వారి నుంచి రూ.7.84 లక్షల విలువ గల 5.1 తులాల బంగారం, 119 తులాల వెండి, రూ.45 వేల నగదు, స్కూటీ, 2 సెల్ఫోన్లను స్వాధీనం చేసుకొన్నారు. వారిని కోర్టులో హాజరుపర్చనున్నట్లు తెలిపారు. సీఐ రాజశేఖర్, ఎస్సై లచ్చిరెడ్డి, కృష్ణాచారి, క్లూస్‌టీం ఎస్సై శివ, సిబ్బంది వెంకటేశ్వర్లు, శ్రీకాంత్, శ్రీను, జనార్దన్, మధుకర్, సురేశ్, సుధాకర్, నాగార్జున, శ్రీనివాస్‌లను అభినందించారు.