గుడిపల్లి, జనవరి 05 : ప్రభుత్వం అందించే చేయూతను సద్వినియోగం చేసుకుంటూ గ్రామాలను అభివృద్ధి పథంలో నడిపించాలని గుడిపల్లి ఎంపీడీఓ అండాలు అన్నారు. అలాగే ప్రజలకు అందుబాటులో ఉంటూ, సమస్యలకు పరిష్కారం చూపిస్తూ, ప్రభుత్వ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకునేలా చూడాల్సిన కర్తవ్యం తమందరిపై ఉందన్నారు. ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మండలంలోని 12 గ్రామాల్లో నూతనంగా ఎన్నికైన సర్పంచుల సన్మానోత్సవ కార్యక్రమం సోమవారం ఎంపీడీఓ కార్యాలయంలో నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న ఆమె ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నూతన సర్పంచులకు శుభాకాంక్షలు తెలిపి అభినందించారు. ప్రజలకు సుస్థిరమైన పరిపాలన అందించాలని కోరారు. అనంతరం శాలువాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఇన్చార్జి మండల పంచాయతీ ఆఫీసర్ (ఎంపీఓ), గుడిపల్లి గ్రామ పంచాయతీ కార్యదర్శి వడ్త్య నవీన్, ఆయా గ్రామాల గ్రామ పంచాయతీ కార్యదర్శులు, ఎంపీడీఓ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.