కోదాడ, ఆగస్టు 16 : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేజీ నుంచి పీజీ వరకు యోగ విద్యను పాఠ్యాంశాల్లో చేర్చాలని తెలంగాణ యోగ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మరికంటి వెంకట్ అన్నారు. డిసెంబర్ 13న హైదరాబాద్లోని ఇందిరా పార్క్ లో నిర్వహించనున్న మహా యోగ సేవ సన్నాహక సమావేశం శనివారం కోదాడలో జరిగింది. ఈ సమావేశంలో వెంకట్ పాల్గొని మాట్లాడారు. నేటి విద్యార్థులు ఒత్తిడి తొలగించుకునేందుకు విద్యాలయాల్లో యోగ విద్యను పాఠ్యాంశంగా చేర్చాల్సిన పరిస్థితి అనివార్యంగా ఉందన్నారు. 90 రోజులలోపు 50 వేల మంది యోగా నిపుణులను రూ.50 వేల గౌరవ వేతనంగా గ్రామ, మండల, జిల్లా, పట్టణ జనాభా ప్రాతిపదికన నియమించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. యోగ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలన్నారు.
చట్ట సభల్లోకి యోగా జీవన శాస్త్రవేత్తలను నామినేటెడ్ పద్ధతి ద్వారా భర్తీ చేయాలన్నారు. ఇదే అంశంపై తెలంగాణ హైకోర్టులో ప్రజా ప్రయోజన వాజ్యం దాఖలు చేసినట్లు తెలిపారు. అనంతరం గోడ పత్రికను ఆవిష్కరించారు. ఈ సమావేశంలో కోదాడ నియోజకవర్గ యోగ సేవా కార్యవర్గాన్ని ప్రకటించారు. గౌరవ అధ్యక్షుడిగా చారుగండ్ల రాజశేఖర్, అధ్యక్షుడిగా ఇరుకుల్ల చెన్నకేశవరావు, ప్రధాన కార్యదర్శిగా ఓరుగంటి నవీన్, కోశాధికారిగా వెంపటి రంగారావు, ఉపాధ్యక్షులుగా కృష్ణమూర్తి, జిల్లా జనార్ధన్, కార్యదర్శిగా ఏడుకొండలు, జిల్లా రాజేంద్రప్రసాద్, కీత శ్రీనివాస్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.