యాదగిరిగుట్ట, మే 20 : యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి స్వయంభూ ప్రధానాలయం, అనుబంధ పూర్వగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో సోమవారం లక్ష్మీనృసింహస్వామి జయంత్యుత్సవాలను అర్చకులు అత్యంత వైభవంగా ప్రారంభించారు. గర్భాలయ ముఖ మండపంలో మంత్ర, వేద సౌష్టవంగా, కళాత్మకంగా మహావైభోపేతంగా ఉత్సవాలు జరిగాయి. ఉదయం ప్రధానాలయాన్ని తెరిచిన అర్చకులు స్వామివారికి అభిషేకం, అర్చనలు నిర్వహించారు.
8:30 గంటలకు ఆలయ ముఖ మండపంలో స్వస్తీవాచనం, విష్వక్సేనారాధన, పుణ్యాహవాచనం, రుత్విక్వరణం, కుంకుమార్చన, రక్షాబంధనం వంటి కైంకర్యాలను చేపట్టారు. అనంతరం స్వామివారికి లక్ష కుంకుమార్చన గావించారు. కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరువేంకటపతి అలంకార సేవలో భక్తకోటిని భగవానుడు అనుగ్రహించారు. మధ్యాహ్నం 12గంటలకు స్వామివారిని స్వయంభూ ప్రధానాలయ మాఢ వీధుల్లో అత్యంత వైభవంగా ఊరేగించారు.
సాయంత్రం 6 గంటలకు నిత్య సామూహిక పారాయణం అనంతరం వేదమంత్రోచ్ఛారణల నడుమ అంకురారోపణం, హవనం నిర్వహించారు. అనంతరం స్వామివారిని పరమవాసుదేవుడిగా అలంకరించి గరుడ వాహనంపై తిరుమాఢవీధుల్లో ఊరేగించారు. స్వయంభూ పంచనారసింహుడి క్షేత్రంలో స్వామి, అమ్మవార్లను పరవాసుదేవ తత్తాలుగా అలంకరించారు. ప్రధానాలయ మాఢవీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. స్వామివారి జయంత్యుత్సవాల సందర్భంగా ప్రధానాలయంలో సాంస్కృతిక కార్యక్రమాలు అత్యంత వైభవంగా జరిగాయి.