యాదగిరిగుట్ట, జూలై 5: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయంతోపాటు అనుబంధ పాతగుట్ట(పూర్వగిరి) ఆలయంలో శనివారం స్వాతి నక్షత్ర పూజలు ఘనంగా జరిగాయి. స్వామివారి జన్మనక్షత్రమైన స్వాతి నక్షత్రం సందర్భంగా అష్టోత్తర శతఘటాభిషేకం నిర్వహించారు. ప్రధానాలయ ముఖ మండపంలో 108 కలశాలను ఏర్పాటు చేసి గం గాది, సప్తనదీ జలాలు, మామిడి, తమలపాకులు, దర్భ లు, పూలమాలలు, కొబ్బరికాయలతో అలంకరించారు.
పంచామృతాలతోపాటు సుగంధ ద్రవ్యాలతో స్వామివారిని అభిషేకించారు. ఆయా దేవతల మూలమంత్ర పఠనాలతో హోమ పూజలు నిర్వహించారు. సాయం త్రం స్వాతి జన్మనక్షత్రం సందర్భంగా స్వామివారిని దివ్యమనోహరంగా అలంకరించి ప్రత్యేక పూజలు జరిపారు. తెల్లవారుజాము నుంచే భక్తులు గిరిప్రదక్షిణలు చేసి స్వామివారి దర్శించుకుని పూజలు చేశారు. వైకుంఠ ద్వారం వద్ద ప్రారంభమైన గిరిప్రదక్షిణ కొండచుట్టూ కాలినడకన పాదయాత్ర నిర్వహించారు. అనంతరం కొండపైకి వెళ్లి స్వయం భూ పంచనారసింహస్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.