యాదగిరిగుట్ట, ఆగస్టు 19: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామివారి ఆలయానికి ఐఎస్వో 9001, ఐఎస్వో 50001, ఐఎస్వో 22000తోపాటు గుడ్ గవర్నెన్స్ కలిపి నాలుగు సర్టిఫికేషన్ పురస్కారాలు లభించాయి. దేశంలోనే ఎనర్జీ ఆడిట్ నిర్వహించిన మొట్టమొదటి ఆలయంగా చరిత్రలో నిలిచింది. ఆల య పరిపాలన, నిర్వహణ, భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాల్లో నాణ్యత, పారదర్శకతకు గానూ ఐఎస్వో 9001 పురస్కారం వరించగా, శక్తి వినియోగంలో పొదుపు, ఇంధన నిర్వహణ సామర్థ్యం పెంచేందుకు తీసుకుంటున్న చర్యలకు గానూ ఐఎస్వో 50001 సర్టిఫికెట్ లభించింది.
ఆలయంలో ప్రసాదం, అన్నదానం విషయంలో పరిశుభ్రత, భద్రతా ప్రమాణాలను గుర్తిస్తూ ఐఎస్వో 22000 సర్టిఫికెట్ అందజేశారు. దేవస్థానంలో పరిపాలన, ఆర్థిక నిర్వహణ, సమాజ సేవలు, పారదర్శకత, ఉన్నత ప్రమాణాల గుర్తిస్తూ హైమ్ ఇంటర్నేషనల్ సర్టిఫికేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఈ పురస్కారాలను ప్రకటించింది. రెండు నెలలుగా విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ శ్రీసుందర రామయ్య సమక్షంలో విజయవంతంగా ఐఎస్వో ఇన్స్పెక్షన్ సర్టిఫికేషన్, ఆడిట్‌ను హెచ్‌వైఎం ఇంటర్నేషనల్ సర్టిఫికేషన్ ఆధ్వర్యంలో గుట్టలో నిర్వహించామని ఆ సంస్థ ఎండీ ఆలపాటి శివయ్య తెలిపారు. సర్టిఫికెట్లు రావడంతో గుట్ట దేవాలయం ఇతర ఆలయాలకు ఆదర్శంగా నిలిచిందన్నారు.
భక్తుల శ్రేయ స్సు, పర్యవరణ పరిరక్షణ, పారదర్శకమైన పాలనకు ఈ ఆలయ కట్టుబడి ఉన్నందుకు సంతోషంగా ఉందని ఆయన పేర్కొన్నా రు. ఐఎస్వో సర్టిఫికెట్లను ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, ధనసిరి అనసూయ, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు సమక్షంలో దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి శైలజారామయ్యర్, దేవాదాయ కమిషనర్, గుట్ట ఈవోలకు అందజేశారు.