యాదగిరిగుట్ట, మార్చి 20 : పంచావతారమూర్తి యాదగిరిగుట్ట లక్ష్మీనృసింహ స్వామి తిరు కల్యాణోత్సవం అనంతరం బుధవారం విశేష ఘట్టమైన చక్రతీర్థ స్నానాన్ని కనుల పండువగా నిర్వహించారు. ఉదయం 10.30 గంటలకు ప్రధానాలయంలో కల్యాణ లక్ష్మీనృసింహ స్వామిని దివ్యమనోహరంగా ఆలంకరించి ప్రత్యేక వేదికపై అధిష్టించారు. ఆలయ ప్రధానార్చకులు, యజ్ఞాచార్యులు, ఉప ప్రధానార్చకులు, పారాయణందారులు, వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య ఆగమశాస్త్ర రీతిలో చేపట్టారు.
ఉత్సవమూర్తులను, చక్రత్ ఆళ్వార్లను మంగళవాయిద్యాలు, వేదపారాయణాలు, భక్తుల జయజయ ధ్వానాలు, కోలాట ప్రదర్శన నడుమ విష్ణుపుష్కరిణి వరకు ఊరేగించారు. పవిత్ర జలంతో లక్ష్మీసమేతుడైన యాదగిరీశుడి స్నానమాచరిస్తున్న సమయంలో యాదాద్రివాసా, యాదిరిగిరీశా, గోవిందా గోవిందా అంటూ భక్తుల నామస్మరణతో గుట్ట మార్మోగింది. శ్రీచక్రత్ ఆళ్వారుల చక్రతీర్థం అనంతరం భక్తులు పుణ్యస్నానాలను ఆచరించారు. సర్వవిధ దోశాల పరిహారార్థం చేసే విశిష్ట ప్రక్రియే చక్రతీర్థ వేడుక అని ఆలయ ప్రధానార్చకులు నల్లన్‌థీఘళ్ లక్ష్మీనరసింహాచార్యులు తెలిపారు.
సకల లోక పాలకుడు, అవతారమూర్తి యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామిని వివిధ రకాల పూలతో సహస్ర నామ పారాయణాలతో శ్రీపుష్పయాగం ఘనంగా నిర్వహించారు. అతివృష్టి, అనావృష్టి లేకుండా సుభిక్షత కోసం శ్రీదేవి, భూదేవి సహితుడైన స్వామివారిని సకల పుష్పరాజములతో అర్చించారు. అనంతరం దేవతోద్వాసన, దోపు ఉత్సవాన్ని వైభవంగా జరిపించారు. బ్రహ్మోత్సవాలకు సూక్ష్మశరీరాలతో విచ్చేసి, వేడుకలను ఆద్యంతం తిలకించి ఆనందభరితులైన దేవతాగణాలను, ఋషిగణాలను, యోగీశ్వరులను ఉత్సవాంతంలో వైదికమంత్ర పూరితంగా తిరిగి వారిని స్వస్థలాలకు పంపించే వేడుకే దేవతోద్వాసన అని అర్చకులు వివరించారు.
బ్రహ్మోత్సవాల్లో భాగంగా యజ్ఞాచార్యులు, అర్చకులు పాంచరాత్రాగమ శాస్త్ర రీతిలో ఆలయ యాగశాలలో చతుస్థానార్చన పూజలు జరిపి వేదమంత్రాలతో మహాపూర్ణాహుతి నిర్వహించారు. బ్రహ్మోత్సవ సమయంలో ఏర్పడిన సకల దోశాలను తొలగించడానికి పరిపూర్ణుడైన పరమాత్ముడిని ప్రార్థించి, నిత్య హవిస్సులను అందించిన అగ్నిదేవుడిని ప్రసన్నం చేసుకునే మహాపూర్ణాహుతి పర్వం ఆలయ ప్రధానార్చకులు నల్లన్‌థీఘళ్ లక్ష్మీనరసింహాచార్యులు, కాండూరి వేంకటాచార్యులు ఆధ్వర్యంలో జరిగింది.
ఈ కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్త బి. నరసింహమూర్తి, కార్యనిర్వహణాధికారి భాస్కర్‌రావు, డీఈఓ దోర్బల భాస్కర్ శర్మ, యాజ్ఞాచార్యులు కిరణ్‌కుమారాచార్యులు, ముఖ్య అర్చకులు మంగళగిరి నరసింహమూర్తి, ఉప ప్రధానార్చకులు సురేంద్రాచార్యులు, భాస్కరాచార్యులు, మాధవాచార్యులు, ఈఈలు ఊడెపు రామారావు, దయాకర్‌రెడ్డి, సహాయ కార్యనిర్వహణాధికారి గజవెల్లి రమేశ్‌బాబు, రఘు, గట్టు శ్రవణ్‌కుమార్, పర్యవేక్షకులు సురేందర్‌రెడ్డి పాల్గొన్నారు.
యాదగిరిగుట్ట వార్షిక బ్రహ్మోత్సవాలు గురువారం పరిపూర్ణం కానున్నాయి. ఉదయం 10 గంటలకు అష్టోత్తర శతఘటాభిషేకం, రాత్రి 9 గంటలకు శృంగార డోలోత్సవంతో వేడుకలకు ముగింపు పలుకనున్నారు.