యాదగిరిగుట్ట, జూన్9 : యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం భక్తులతో కిటకిటలాడింది. వేసవి సెలవులు ముగుస్తుండడంతో ఆదివారం స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఆలయ పరిసరాల్లో ఎటుచూసినా భక్తులే కనిపించారు. తిరుమాడ వీధులు, క్యూ కాంఫ్లెక్స్, గర్భాలయ ముఖ మండపంలోని క్యూలైన్లు భక్తులతో నిండిపోయాయి. ప్రసాద విక్రయశాలలో సందడి నెలకొన్నది. కొండపైకి వాహనాల రద్దీ సాగింది.
స్వామివారి ధర్మదర్శానికి 4 గంటలు, వీఐపీ దర్శనానికి 3 గంటల సమయం పట్టిందని భక్తులు తెలిపారు. నిత్య తిరుకల్యాణోత్సవంలో, ప్రధానాలయ ముఖ మండపంలో ఉత్సవమూర్తులకు జరిగే సువర్ణపుష్పార్చన, వేద ఆశీర్వచనంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. సాయంత్రం వెండి మొక్కు జోడు సేవలు, దర్బార్ సేవలు, శయనోత్సవం కనుల పండువగా సాగాయి. స్వామివారిని సుమారు 65 వేల మంది భక్తులు దర్శించుకున్నారని, దేవస్థాన ఖజానాకు రూ. 83,19,056 ఆదాయం సమకూరిందని ఆలయ అనువంశికధర్మకర్త బి. నరసింహమూర్తి, ఈఓ భాస్కర్రావు తెలిపారు.