భూదాన్ పోచంపల్లి, మే 23 : క్వారీలో పడి యువకుడు మృతి చెందాడు. ఈ ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలం పిలాయిపల్లి గ్రామంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కడప జిల్లా పులివెందుల గ్రామానికి చెందిన వీరబోయిన అశోక్‌కుమార్ (31 ) రెండు నెలల క్రితం పోచంపల్లి మండలంలోని పిలాయిపల్లి గ్రామంలో గల శివగంగా క్రషర్ క్వారీలో సూపర్వైజర్గా విధులు నిర్వహిస్తూ ఉండేవాడు.
బుధవారం గ్రానైట్ వర్క్ చేస్తుండగా ప్రమాదవశాత్తు అదుపుతప్పి కాలుజారి క్వారీలో పడ్డాడు. తలకు బలమైన గాయం అయింది. వెంటనే బాధితుడిని చికిత్స కోసం హైదరాబాద్ వనస్థలిపురంలోని ఏరియా ఆస్పత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. క్వారీ నిర్వాహకుల నిర్లక్ష్యం వల్లే చనిపోయాడని మృతుడి బంధువులు, కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మృతుడి తండ్రి వీరబోయిన రామయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు స్థానిక ఎస్ఐ కంచర్ల భాస్కర్ రెడ్డి తెలిపారు.