సంస్థాన్ నారాయణపురం, మే 31 : యోగాను జీవితంలో భాగం చేసుకోవాలని యాదాద్రి భువనగిరి జిల్లా యువజన, క్రీడల అధికారి ధనుంజనేయులు అన్నారు. శనివారం జిల్లా యువజన, క్రీడల శాఖ ఆధ్వర్యంలో సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలో నిర్వహిస్తున్న ఉచిత వేసవి క్రీడా శిక్షణ శిబిరం ముగింపు కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ట్రైనీ ఎస్ఐ కట్ట శివశంకర్ రెడ్డి శిక్షణలో పాల్గొన్న బాల బాలికలకు సర్టిఫికెట్లను ప్రదానం చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ యోగాను, ఆటలను జీవితంలో భాగస్వామ్యం చేసుకోవాలన్నారు. ఉచిత వేసవి శిక్షణ శిబిరాలు క్రీడల్లో రాణించడానికి దోహదపడతాయని తెలిపారు. అనంతరం భేటీ బచావో బేటి పడావో కార్యక్రమంలో భాగంగా ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చైల్డ్ వెల్ఫేర్ సిబ్బంది భార్గవి, టైక్వాండో మాస్టర్ గుర్రం కృష్ణ, స్పోర్ట్స్ క్లబ్ అధ్యక్షుడు సిలువేరు సైదులు, బద్దుల మురళి పాల్గొన్నారు.