చౌటుప్పల్, ఆగస్టు 30 : విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ మొబైల్ సేవలను వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలని విద్యుత్ శాఖ డీఈ మల్లికార్జున్ అన్నారు. శనివారం చౌటుప్పల్ పట్టణ కేంద్రంలోని విద్యుత్ సబ్ స్టేషన్లో ట్రాన్స్ఫార్మర్ మొబైల్స్ సేవలను ఆయన ప్రారంభించి మాట్లాడారు. రాత్రి వేళల్లో ఎక్కడైనా ట్రాన్స్ఫార్మర్ మరమ్మతులకు గురైనప్పుడు వెంటనే మొబైల్ ట్రాన్స్ఫార్మర్ అమర్చే అవకాశం ఉంటుందన్నారు. తద్వారా త్వరితగతిన సమస్యను పరిష్కారం చేసుకోవచ్చన్నారు. దాదాపు రూ.15 లక్షల వ్యయంతో స్థానిక ఎమ్మెల్యే సహకారంతో దీనిని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ ఏడీఈ పద్మ, ఏఈ రాజుల సతీశ్, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.