మోత్కూరు, ఆగస్టు 12 : ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు విద్యార్థుల భద్రతను పక్కన పెట్టి అనుభవం లేని డ్రైవర్లను నియమిస్తున్న తీరు మోత్కూరులో మరోసారి తీవ్ర విమర్శలకు గురైంది. మంగళవారం సెంటెన్స్ స్కూల్‌కి చెందిన బస్సు అదుపుతప్పి రోడ్డు పక్క గోతిలో పడిన ఘటనతో, చిన్నారులు ప్రాణాపాయం నుండి బయటపడ్డారు. పాఠశాల ముగిసిన అనంతరం విద్యార్థులను గ్రామాలకు చేర్చుతున్న బస్సు, దత్తప్పగూడెం రోడ్డులో అదుపుతప్పింది. బస్సులో ఉన్న 35 మంది విద్యార్థులు భయంతో కేకలు వేయడంతో స్థానికులు వెంటనే స్పందించి వారిని రక్షించారు.
గ్రామీణ రోడ్లపై తరచూ ఓవర్ స్పీడ్‌గా దూసుకుపోతున్న పాఠశాల బస్సులపై పలుమార్లు ఫిర్యాదులు చేసినా స్కూల్ యాజమాన్యం పట్టించుకోవడం లేదని తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా స్కూల్ యాజమాన్యాలపై అధికారులు చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.