బీబీనగర్, మార్చి 17 : ఆయిల్ రీసైక్లింగ్ పరిశ్రమను నివాస ప్రాంతాలకు దూరంగా తరలించి అనారోగ్యం భారిన పడుతున్న గ్రామస్తులను కాపాడాలని మాజీ సర్పంచ్ దేవరకొండ వేణుగోపాల్ కోరారు. సోమవారం ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా మండలంలోని మహదేవ్పూర్ గ్రామంలో ఎకో నాచురల్ కెమి ప్యూల్స్ ప్రైవేట్ లిమిటెడ్ పరిశ్రమను గ్రామానికి దూరంగా తరలించాలని కోరుతూ కలెక్టర్ హనుమంతరావుకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ పరిశ్రమ నుండి విషపూరితమైన గ్యాస్లు విడుదల చేస్తున్నారని దీనివల్ల గ్రామ ప్రజలతో పాటు పరిసర ప్రాంత గ్రామాలైన జమీలాపేట్, రాయరావుపేట్, నెమరగోముల గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నట్లు తెలిపారు.
పరిశ్రమ నుండి వెలువడుతున్న గ్యాస్ ద్వారా పసిపిల్లలకు, వృద్దులకు అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయన్నారు. విషపూరితమైన ఆయిల్ వల్ల భూగర్భ జలాలు కలుషితమై పంట పొలాలు దెబ్బతింటున్నాయన్నారు. గ్రామంలో 700 సంవత్సరాల చరిత్ర గల పురాతన ఆలయ దర్శనానికి సుదూర ప్రాంతాల నుండి భక్తులు అధిక సంఖ్యలో వస్తారని, గ్యాస్ విడుదల చేయడం వల్ల కలుషిత వాతావరణంలో భక్తులు కూడా ఇబ్బందులు పడుతున్నారన్నారు. పరిశ్రమను దూర ప్రాంతాలకు తరలించి గ్రామ ప్రజలు, పాడి పశువులు అనారోగ్యం భారిన పడకుండా, భూగర్బ జలాలు కలుషితం కాకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్వీ మండల అధ్యక్షుడు పచ్చిమట్ల వంశీగౌడ్, బీఆర్ఎస్ నాయకుడు ఆకుల ప్రవీణ్ కుమార్ పాల్గొన్నారు.