ఆలేరు టౌన్, జూన్ 11 : పెంచిన బస్ పాస్ చార్జీలను వెంటనే తగ్గించాలని ప్రగతిశీల యువజన సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి బేజాడి కుమార్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం ఆయన మాట్లాడుతూ..రాష్ట్రంలో అధిక శాతం విద్యార్థులు కళాశాలలకు, పాఠశాలకు రావడానికి ఉపయోగించే బస్సు పాస్ చార్జీలను పెంచి, ఆర్థిక భారం వేయడమంటే విద్యార్థులను విద్యకి దూరం చేయడమే అన్నారు. మహాలక్ష్మి పథకం మహిళలకు బహుమతి అని గొప్పలు చెప్పుకునే ఈ ప్రభుత్వానికి రాష్ట్రంలోని విద్యార్థులు కనబడడం లేదా అని ప్రశ్నించారు.
అధికారంలోకి వచ్చిన తర్వాత జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని హామీ ఇచ్చి నేటి వరకు ఒక్క జాబ్ నోటిఫికేషన్ కూడా విడుదల చేయకుండా కాలయాపన చేస్తుందని దుయ్యబట్టారు. ఈ రోజుకి రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రి లేరంటనే రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి విద్యార్థులపై ఉన్న చిత్తశుద్ధి అర్థమవుతుందన్నారు. పెంచిన బస్సు పాస్ చార్జీలను తక్షణమే తగ్గించి, విద్యార్థులందరికీ ఉచిత బస్ పాస్ సౌకర్యం కల్పించాలని పీడీఎస్యూ, పీవైఎల్ డిమాండ్ చేస్తున్నట్లు పేర్కొన్నారు.