యాదగిరిగుట్ట, జూన్ 12 : స్వామివారి ఆలయంలోని ప్రసాద విక్రయశాలలో జరిగిన చింతపండు దొంగతనం కేసులో దేవదాయ ధర్మదాయశాఖ అదనపు కమిషనర్ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో హైలెవల్ విచారణ కమిటిని ఏర్పాటు చేస్తున్నట్లు దేవదాయ ధర్మదాయ రాష్ట్ర కమిషనర్, ఈఓ వెంకట్రావ్ తెలిపారు. గురువారం కొండపైన ఈఓ కార్యాలయంలో మీడియాతో ఆయన మాట్లాడారు. ఈ కమిటీలో దేవదాయ ధర్మదాయ శాఖ రీజనల్ జాయింట్ కమిషనర్ తో పాటు రంగారెడ్డి, నల్లగొండ, సికింద్రాబాద్‌కు చెందిన దేవదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్లు ఉంటారన్నారు. కమిటీ నివేదిక అనంతరం దోషులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఇప్పటికే ఫైవ్‌మెన్ కమిటీ వేయగా ప్రాధమిక నివేదిక ఇచ్చినట్లు చెప్పారు.
సత్యనారాయణ స్వామి వ్రతమాచరించే భక్తులకు గతంలో రూ.800 టికెటు ఉండగా దానిని రూ.1,000 పెంచి భక్తులకు స్వామివారి శెల్లా, కనుముతో పాటు స్వామివారి ప్రతిమను అందజేస్తామన్నారు. ప్రతి భక్తుడికి స్వామివారి పులిహోరతో పాటు ప్రతి శనివారం స్వామివారి లడ్డూ ప్రసాదాన్ని అందజేస్తామని తెలిపారు. ఇందుకు సంబంధించి ఈ నెల 14 నుంచి ఫైలెట్ ప్రాజెక్టును ప్రారంభిస్తామన్నారు. జూలై 1వ తేదీ నుంచి పూర్తిస్థాయిలో కొనసాగింపు ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్త బి.నరసింహమూర్తి, ప్రధానార్చకులు లక్ష్మీనరసింహచార్యులు, ఈఈలు రామారావు, దయాకర్ రెడ్డి పాల్గొన్నారు.