వలిగొండ, జూన్ 13 : భవన నిర్మాణ పనికి కూలీగా వెళ్లిన వ్యక్తి పనిచేస్తున్న చోట ప్రమాదవశాత్తు కిందపడి మృతి చెందాడు. ఈ ఘటన వలిగొండ మండలంలోని వేములకొండ గ్రామంలో చోటుచేసుకుంది. శుక్రవారం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చిన్నపాక బాబు అనే వ్యక్తి రామన్నపేట మండలంలోని ఎన్నారం గ్రామంలో నివాసం ఉంటున్నాడు. భవన నిర్మాణ కూలీగా జీవనం కొనసాగిస్తున్నాడు. గురువారం రోజున వేములకొండ గ్రామంలో భవన నిర్మాణ పనులకు వెళ్లి ప్రమాదవశాత్తు కిందపడి మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చెరుకున్న మృతదేహాన్ని రామన్నపేట ప్రభుత్వ దవాఖానకు తరలించారు. బాబు కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ యుగేందర్ తెలిపారు.