ఆలేరు టౌన్, జూన్ 11 : నియోజకవర్గ కేంద్రమైన ఆలేరు పట్టణంలో ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఏర్పాటు చేయాలని అఖిలపక్ష కమిటీ కన్వీనర్ పసునూరి వీరేశం రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం ఆలేరు పట్టణ కేంద్రంలోని ఆర్యవైశ్య భవనంలో జరిగిన అఖిలపక్ష కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆలేరు పేరుకే అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రంగా ఉందని, కానీ ఆలేరుకు రావాల్సిన కార్యాలయాలు ఇతర ప్రాంతాలకు తరలిపోవడం వల్ల ఆలేరు ప్రాంతాన్ని పాలకులు పూర్తిగా విస్మరించారని ఆయన మండిపడ్డారు. గతంలో ఆలేరులో ఉన్న ఆర్ అండ్ బి కార్యాలయం యాదగిరిగుట్ట తరలించడం జరిగిందన్నారు. అలాగే ఆలేరుకు రావాల్సిన ఏసీపీ కార్యాలయం, ఆలేరులో ఉండాల్సిన సబ్ రిజిస్టర్ ఆఫీస్, ఆలేరుకు రావాల్సిన వంద పడకల హాస్పిటల్ యాదగిరిగుట్ట ప్రాంతానికి తరలించడం జరిగిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
తాజాగా ఇంటిగ్రేటెడ్ స్కూల్ తుర్కపల్లికి తరలించడం సమంజసమేనా అని ఆయన ప్రశ్నించారు. పాలకులు ఆలేరు ప్రాంతాన్ని పూర్తిగా నిర్వీర్యం చేస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సందర్భంగా తాము అధికారంలోకి వస్తే 100 రోజుల్లో ఆలేరు రెవిన్యూ డివిజన్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చిందని, దాదాపు 18 నెలలు కావస్తున్నా ఇంతవరకు అధికార ప్రకటన రాకపోవడం శోచనీయమన్నారు. ఈ విధంగా ఆలేరులోని కార్యాలయాలు వేరే ప్రాంతానికి తరలిస్తే 2026లో జరిగే డీలిమిటేషన్లో ఆలేరు అసెంబ్లీ కోల్పోయే ప్రమాదం ఉందన్నారు.
వెంటనే ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య స్పందించి ఆలేరు రెవెన్యూ డివిజన్‌కు సంబంధించిన అధికార ప్రకటన చేయించాలన్నారు. అలాగే ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఆలేరు పట్టణంలో ఏర్పాటు చేయించాలని ఈ సమావేశంలో అఖిలపక్ష కమిటీ డిమాండ్ చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో కన్వీనర్ పసుపును వీరేశం, కో కన్వీనర్ రాచకొండ జనార్ధన్, చెక్క వెంకటేశ్, నంద గంగేశ్, కామిటికారి అశోక్, సముద్రాల సత్యం, బిక్కిరి సహదేవ్, బాంబే రవి పాల్గొన్నారు.