భూదాన్ పోచంపల్లి, సెప్టెంబర్ 25 : ప్రభుత్వ, ప్రైవేట్ రంగ జాతీయ బ్యాంకులకు ధీటుగా పోచంపల్లి బ్యాంకుల్లో అధునాతన సేవలు అందిస్తున్నట్లు పోచంపల్లి కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ చైర్మన్ తడక రమేశ్ తెలిపారు. గురువారం పట్టణ కేంద్రంలోని పోచంపల్లి కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ కొంగరి భాస్కర్ ఆడిటోరియంలో జరిగిన పోచంపల్లి బ్యాంక్ 51వ సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడారు. బ్యాంక్ ప్రగతి పథంలో దూసుకెళ్తుందని, ప్రస్తుతం 15 శాఖలతో ఉన్న బ్యాంక్ అతి త్వరలోనే 22 శాఖలకు విస్తరించనున్నట్లు తెలిపారు. ప్రతి సంవత్సరం బ్యాంక్ జాతీయ స్థాయిలో అవార్డులు గెలుచుకోవడం బ్యాంక్ అభివృద్ధికి నిదర్శనం అన్నారు. 2025 మార్చి 31 నాటికి సేకరించిన డిపాజిట్లు రూ.236.54 కోట్లు, మంజూరు చేసిన రుణాలు రూ.167.98 కోట్లు కలవని తెలిపారు.
ఆగస్టు 31 నాటికి డిపాజిట్లు రూ.257. 07 కోట్లు, రుణాలు రూ.202.62 కోట్లకు చేరినట్లు చెప్పారు. బ్యాంకింగ్ రంగంలో వస్తున్న విప్లవాత్మక మార్పులకు అనుగుణంగా సిబ్బందిలో నైపుణ్యాన్ని పెంపొందించుటకు నిరంతరం శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తూ నిష్ణాతులుగా తీర్చిదిద్దేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీలు మాడుగుల ప్రభాకర్ రెడ్డి, బడుగు దానయ్య, మాజీ చైర్మన్ కర్నాటి పాండు, వైస్ చైర్మన్ భారత రాజేంద్రప్రసాద్, డైరెక్టర్లు కర్నాటి బాలసుబ్రమణ్యం, ఏలే హరిశంకర్, సురపల్లి రమేష్, రాపోలు వేణు, గుండు కావ్య, కర్నాటి భార్గవి, కొండమడుగు ఎల్లస్వామి, బిట్టు భాస్కర్, మక్తాల నరసింహ, రామ గోపాలరావు, ఖాతాదారులు, వాటాదారులు పాల్గొన్నారు.