ఆలేరు టౌన్, ఆగస్టు 25 : నిజాం నిరంకుశత్వానికి వ్యతిరేకంగా తన కలంతో గళం విప్పి, ప్రజాస్వామ్య విలువల పరిరక్షణ కోసం అక్షర పోరాటం సాగించిన ప్రముఖ పాత్రికేయుడు, ఇమ్రోజ్ పత్రిక సంపాదకుడు, స్వర్గీయ షోయబుల్లాఖాన్ స్మారకార్థం ఆలేరు ప్రెస్ క్లబ్‌కు ఆయన పేరు పెట్టారు. మంగళవారం ఆలేరు ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో సోయాబుల్లా ఖాన్ భవనంగా ఆలేరు ప్రెస్ క్లబ్ భవనానికి నామకరణం చేశారు. ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎండీ కుర్షిత్ పాషా, జంపాల దశరథ మాట్లాడుతూ.. షోయబుల్లాఖాన్ తన రచనల ద్వారా నిజాం నిరంకుశ పాలనను ప్రశ్నించి ప్రజల పక్షాన నిలిచిన ధైర్యవంతమైన జర్నలిస్టుగా చరిత్రలో చిరస్థాయిగా నిలిచారన్నారు. పత్రికా స్వేచ్ఛ, ప్రజాస్వామ్య హక్కులు, సామాజిక న్యాయం కోసం ఆయన చేసిన పోరాటం నేటితరం పాత్రికేయులకు స్ఫూర్తిగా నిలుస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ కార్యవర్గం సభ్యులు మొరిగాడి మహేశ్, చింతకింది వెంకటేశ్వర్లు, సామల సిద్ధులు, ముల్లెక్కల రవి, సందెన శంకర్, కొరుటూరు ఉపేందర్, మంచాన మల్లేశం, ఆకుల సత్యనారాయణ పాల్గొన్నారు.