యాదాద్రి, జూన్ 2 : యాదాద్రి లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో అర్చకులు నిత్యపూజలు గురువారం కోలాహలంగా నిర్వహించారు. ఉదయం ఆలయాన్ని తెరిచిన అర్చకులు స్వామి అమ్మవార్లను అభిషేకించారు. తులసీదళాలతో అర్చించి అష్టోత్తర పూజలు చేశాక భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ప్రధానాలయ ప్రాకార మండపంలో సుదర్శన నారసింహ హోమం, నిత్య తిరుకల్యాణోత్సవం జరిపించారు. కొండపైన ఉన్న పర్వతవర్ధినీ రామలింగేశ్వరుడికి అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు.
పార్వతీదేవిని కొలుస్తూ కుంకుమార్చన చేశారు. కొండ కింద లక్ష్మీపుష్కరిణిలో భక్తులు పుణ్యస్నానం ఆచరించి సంకల్పంలో పాల్గొన్నారు. రాత్రి ప్రధానాలయ ముఖ మండపంలో ప్రతిష్ఠామూర్తులకు ఆరాధన, సహస్రనామార్చన చేశారు. యాదాద్రి ఆలయంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించే సత్యనారాయణ స్వామి వ్రత పూజల్లో భక్తులు పాల్గొన్నారు. పాతగుట్ట ఆలయంలో స్వామి నిత్యోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు దర్శనాలు కొనసాగాయి. అన్ని విభాగాలను కలుపుకుని స్వామివారి ఖజానాకు రూ.30,03,149 ఆదాయం సమకూరిందని ఇన్చార్జి ఈఓ రామకృష్ణారెడ్డి తెలిపారు.
శ్రీవారి ఆలయంలో జరిగే సత్యనారాయణ స్వామి వ్రతాలను కొండ కింద గల దీక్షాపరుల మండపంలో గురువారం ప్రారంభించారు. కొన్ని నెలలుగా యాదాద్రి కొండపైన గల పాత గోశాలలో నిర్వహిస్తున్న వ్రతాలను దీక్షా పరుల మండపానికి మార్చారు. యాదాద్రి ఆలయ పునర్నిర్మాణంలో భాగంగా కొండపైన క్యూ కాంప్లెక్స్‌లో నిర్వహించిన వ్రత మండపాలను కొండకింద పాతగోశాలలోకి మార్చారు. ఆలయ పునః ప్రారంభం అనంతరం కొండకింద గల దీక్షాపరుల మండపాన్ని నిత్యన్నదాన సత్రంగా మార్చారు. దీక్షాపరుల మండపం వద్ద భక్తుల రద్దీతో సత్యనారాయణ వత్ర మండపానికి వెళ్లేందుకు భక్తులకు ఇబ్బంది ఏర్పడింది. పరిస్థితిని గమించిన దేవస్థాన అధికారులు భక్తుల సౌకర్యార్థం దీక్షాపరుల మండపంలో సత్యనారాయణ వ్రతాలను ప్రారంభించారు. మొదటిరోజు నాలుగు విడతలుగా సత్యనారాయణ వ్రతాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
యాదాద్రీశుడి కొండపైకి వెళ్లే మొదటి ఘాట్‌రోడ్డు పునరుద్ధరణ పనులు కొనసాగుతున్న నేపథ్యంలో తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు ఆలయాధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో భక్తులు రెండో ఘాట్‌రోడ్డును వినియోగించుకుని కొండపైకి వెళ్లాల్సిందిగా సూచించారు.
శ్రీవారిని జిల్లా అదనపు న్యాయమూర్తి మారుతీదేవి, మధ్యప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి అంజులిపాలో వేర్వేరుగా దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వారికి ఘన స్వాగతం పలికి వేదాశీర్వచనం అందించగా, ఆలయ అనువంశిక ధర్మకర్త బి.నర్సింహమూర్తి స్వామి ప్రసాదం అందించారు.
ప్రధాన బుక్కింగ్ ద్వారా 2,71,150
వీఐపీ దర్శనం 1,50,000
వేద ఆశీర్వచనం 13,200
నిత్యకైంకర్యాలు 2,301
సుప్రభాతం 6,900
క్యారీబ్యాగుల విక్రయం 17,000
వ్రత పూజలు 1,70,400
కళ్యాణకట్ట టిక్కెట్లు 41,200
ప్రసాద విక్రయం 10,74,000
వాహనపూజలు 16,200
అన్నదాన విరాళం 91,363
శాశ్వత పూజలు 80,000
సువర్ణ పుష్పార్చన 1,27,412
యాదరుషి నిలయం 75,970
పాతగుట్ట నుంచి 51,310
కొండపైకి వాహన ప్రవేశం 3,00,000
లక్ష్మీపుష్కరిణి 1,000
గోపూజ 600
లీసెస్,లీగల్ 5,13,143