యాదాద్రి, ఆగస్టు 13 : యాదగిరిగుట్ట లక్ష్మీసమేతుడైన నరసింహస్వామి దర్శనానికి శనివారం బారులుతీరారు. మొక్కు పూజల నిర్వహణతో మండపాల్లో భక్తుల సందడి నెలకొంది. శ్రావణమాసంతో పాటు వరుస సెలవులు, గ్రామాల్లో బోనాల జాతర కావడంతో ఇలవేల్పు దర్శనానికి భక్తులు పెద్దసంఖ్యలో తరలివస్తున్నారు. ఆర్జిత పూజల కోలాహలం తెల్లవారుజామున 3గంటల నుంచి మొదలైంది. నిజాభిషేకంతో ఆరాధనలు ప్రారంభించి ఉత్సవమూర్తులను అభిషేకించారు.
ఉదయం 3గంటలకు సుప్రభాతం నిర్వహించిన అర్చకులు లక్ష్మీనారసింహుడిని ఆరాధిస్తూ ప్రత్యేక పూజలు చేసి హారతి నివేదనలు అర్పించారు. సుదర్శన హోమంతో శ్రీవారిని కొలవడంతో పాటు, ఆళ్వారును కొలుస్తూ హోమం చేశారు. ప్రతిరోజూ నిర్వహించే నిత్య కల్యాణోత్సవంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. దేవేరులను ముస్తాబు చేసి గజవాహనంపై ప్రధానాలయ వెలుపలి ప్రాకార మండపంలో ఊరేగించారు.
లక్ష్మీసమేతుడైన నారసింహుడిని ఆరాధిస్తూ సుమారు గంటన్నరకు పైగా కల్యాణ తంతు జరిపించారు. ఉదయం నుంచి రాత్రి వరకు నిరాటంకంగా దర్శనాలు కొనసాగాయి. సాయంత్రం వేళ అలంకార జోడు, దర్బార్ సేవలు నిర్వహించారు. పర్వతవర్ధిణీ సమేత రామలింగేశ్వరుడికి రుద్రాభిషేకం, నవగ్రహాలకు తైలాభిషేకం, అమ్మవారికి కుంకుమార్చనలు చేశారు. కొండకింద దీక్షాపరుల మండపంలో సత్యనారాయణ స్వామి వ్రతాలు ఘనంగా నిర్వహించారు. వ్రత పూజల్లో భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. స్వామివారిని 25వేల మంది భక్తులు దర్శించుకున్నారు. శ్రీవారి ఖజానాకు రూ.23,37,923 ఆదాయం సమకూరిందని ఆలయ ఈఓ ఎన్.గీత తెలిపారు.
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో శ్రావణమాసం సందర్భంగా అత్యంత వైభవంగా చేపట్టిన ‘శ్రావణలక్ష్మి కోటికుంకుమార్చన’ కార్యక్రమం శనివారం 16వ రోజుకు చేరింది. కుంకుమార్చనలో పాల్గొన్న భక్తులకు అమ్మవారి కుంకుమ ప్రసాదం, స్వామివారి శెల్లా, కనుమును అందించారు. కోటి కుంకుమార్చనలో భాగంగా 30 మంది రుత్వికులు పాల్గొని 57.60లక్షల సార్లు లక్ష్మీ నామాలు పఠించారు.
యాదాద్రీశుడిని రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయశాఖ కమిషనర్ అనిల్‌కుమార్ దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. శనివారం యాదగిరికొండకు చేరుకున్న ఆయన మొదటగా ఆర్టీసీ బస్టాండ్, క్యూ కాంప్లెక్సులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. స్వాగతతోరణం, పోలీస్ కంట్రోల్ రూం పునర్నిర్మాణ పనులను పరిశీలించారు.
క్యూకాంప్లెక్స్‌లో భక్తుల వసతులపై ఆలయాధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం స్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వేదాశీర్వచనం ఇవ్వగా ఆలయ ఈఓ ఎన్.గీత స్వామివారి ప్రసాదం అందజేశారు. అనంతరం ఈఓ కార్యాలయంలో ఆలయాధికారులతో సమీక్ష జరిపారు. దేవస్థానంలో ఉన్న సమస్యలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.
కరోనా వ్యాప్తి నేపథ్యంలో నిలిపివేసిన స్వామివారి తీర్థ ప్రసాదాన్ని ఆలయ అధికారులు శనివారం పునః ప్రారంభించారు స్వయంభువులను దర్శించుకుని తిరిగి బయటకు వచ్చే పశ్చిమ పంచతల రాజగోపురం వద్ద అర్చకులు తీర్థ ప్రసాదాన్ని భక్తులకు పంపిణీ చేశారు. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం 2020 మార్చి 23న లాక్డౌన్ విధించింది.
కరోనా తీవ్ర రూపం దాల్చడంతో బాలాలయంలో భక్తులకు అందించే స్వామివారి తీర్థ ప్రసాదాన్ని ఆలయాధికారులు నిలిపివేశారు. అప్పటి నుంచి ఇప్పటివరకు స్వామివారి తీర్థం తీసుకునే భాగ్యం భక్తులకు లేకుండా పోయింది. రెండేళ్ల అనంతరం స్వామివారి ప్రధానాలయంలో తీర్థ ప్రసాదాన్ని పునః ప్రారంభించడంతో భక్తులు ఆనందం వ్యక్తంచేశారు.
ప్రధాన బుక్కింగ్ ద్వారా 2,79,950
వీఐపీ దర్శనం 2,02,500
వేద ఆశీర్వచనం 12,600
నిత్యకైంకర్యాలు 2,500
సుప్రభాతం 5,600
క్యారీబ్యాగుల విక్రయం 11,000
వ్రత పూజలు 2,43,200
కళ్యాణకట్ట టిక్కెట్లు 26,000
ప్రసాద విక్రయం 8,41,900
వాహనపూజలు 12,000
అన్నదాన విరాళం 17,895
సువర్ణ పుష్పార్చన 1,25,948
లక్ష్మీ పుష్కరిణి 1,500
యాదరుషి నిలయం 1,11,700
పాతగుట్ట నుంచి 29,770
కొండపైకి వాహనాల అనుమతి 4,00,000
శివాలయం 6,500
ఇతర విభాగాలు 2,360