గుడిపల్లి, ఏప్రిల్ 2: గుడిపల్లి మండలం కేశంనేనిపల్లిలో రేషన్ దుకాణం ద్వారా గ్రామస్తులకు తుట్టెలు కట్టిన, పురుగులు పట్టిన, ఎలుక పెంటలతో కూడిన దొడ్డు బియ్యాన్ని గత రెండు రోజులుగా పంపిణీ చేస్తున్నారు. రాష్ట్ర ఫ్రభుత్వ ప్రజలకు ఉచితంగా ఒక్కొక్కరికీ 6కేజీల చొప్పున సన్నబియ్యం ఇస్తున్నామని గొప్పలు చెప్పుకుంటోంది. కానీ ఇక్కడ మాత్రం గతంలో మిగిలి పోయిన, నిల్వ ఉన్న దొడ్డు బియ్యాన్ని రేషన్ డీలర్ గత రెండు రోజులుగా పంపిణీ చేస్తున్నారు.
ఇదేంటని రేషన్ డీలర్‌ను ప్రశ్నిస్తే దొడ్డు బియ్యం అయిపోతేనే మళ్లీ బియ్యం వస్తాయని చెబుతున్నాడు. ఈ బియ్యం ఎలా తినేది అంటూ జనం గగ్గోలు పెడుతున్నారు. దీంతో రేషన్ డీలర్ బియ్యం తీసుకెళ్లి బర్రెలకు, పశువులకు పెట్టమని చెప్పడం గమనార్హం. దీనిపై తక్షణమే ప్రభుత్వం, సంబంధిత అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.