నీలగిరి, ఏప్రిల్ 07 : ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా నల్లగొండ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ సత్యనారాయణ సూచన మేరకు మంగళవారం ప్రభుత్వ మెడికల్ కళాశాలలోని కమ్యూనిటీ మెడిసిన్ విభాగ నేతృత్వంలో ప్రపంచ అరోగ్య దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా పట్టణ ఆరోగ్య శిక్షణ కేంద్రంలో పోషకాహారాన్ని పంపిణీ చేశారు. అనంతరం ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇచ్చిన టుగెదర్ ఫర్ హెల్త్-స్టాండ్ విత్ సైన్స్ అనే పిలుపు మేరకు లైన్వాడ హెల్త్ సెంటర్ దగ్గర మెడికల్ విద్యార్థులతో కలిసి అవగాహన ర్యాలీ నిర్వహించారు.
అనంతరం మెడికల్ కాలేజీలో పోస్టర్ ఆవిష్కరణ, ప్రదర్శన నిర్వహించారు. విద్యార్థులతో కలిసి వెన్ సైన్స్ స్పీక్స్- షుడ్ వి లిసన్ ఆర్ కోషన్ అనే అంశంపైన డిబేట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి డాక్టర్ శ్రీనివాస్, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ రామచంద్ర, డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ నగేష్, డాక్టర్ స్వరూప, డాక్టర్ భద్రినారాయణ, డాక్టర్ అనుపమ, కమ్యూనిటీ మెడిసిన్ ఫాకల్టీ, ఇతర వైద్య సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

నల్లగొండ మెడికల్ కాలేజీలో ప్రపంచ ఆరోగ్య దినోత్సవం