హాలియా, ఫిబ్రవరి 20 : మహశివరాత్రి సందర్భంగా అనుముల మండలం పేరూరు గ్రామంలో స్వయంభూ సోమేశ్వర స్వామి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో రెండు రోజులుగా నిర్వహించిన రాష్ట్ర స్ధాయి మహిళా కబడ్డీ పోటీలు సోమవారం ముగిశాయి. ప్లడ్లైట్ల వెలుతురులో ఉత్కంఠ భరితంగా సాగిన డే అండ్ నైట్ కబడ్డీ పోటీలను చూసేందుకు చుట్టుపక్కల గ్రామాల నుంచి క్రీడాభిమానులు భారీగా తరలివచ్చారు. గ్రామంలో ఒకవైపు జాతర, మరోవైపు రాష్ట్ర స్థాయి మహిళా కబడ్డీ పోటీలతో సందడి నెలకొంది.
హోరాహోరీగా పోటీలు..
పేరూరులో రెండో రోజు మహిళా జట్ల మధ్య పోటీలు హోరాహోరీగా జరిగాయి. సోమవాం రంగారెడ్డి జిల్లా జట్టుపై నల్లగొండ జట్టు 3 పాయింట్లతో గెలిచి విజేతగా నిలిచింది. సోషల్ వెల్ఫేర్ రంగారెడ్డి జట్టుపై హైదరాబాద్ జట్టు 15 పాయింట్లతో ఘనవిజయం సాధించింది. సూర్యాపేటపై ఖమ్మం జట్టు 11 పాయింట్లతో గెలుపొందగా, ఏకలవ్య వరంగల్పై ములుగు జిల్లా జట్టు 18 పాయింట్లతో విజయం సాధించింది.
విజేతలు వీరే…
పేరూరు గ్రామంలో రెండు రోజులపాటు నిర్వహించిన రాష్ట్ర స్థాయి మహిళా కబడ్డీ పోటీల్లో గెలుపొందిన జట్లకు నిర్వాహకులు బహుమతులను అందజేశారు. మొదటి స్థానం సాధించిన నల్లగొండ జిల్లా జట్టుకు రూ. 50 వేలు, రెండో స్థానం సాధించిన రంగారెడ్డి జట్టుకు రూ. 40 వేలు, మూడో స్థానంలో హైదరాబాద్ జట్టుకు రూ. 30 వేలు, నాల్గో స్థానంలో సోషల్ వెల్పేర్ రంగారెడ్డికి జట్టుకు రూ. 20 వేలు, ఐదో స్థానం పొందిన ఖమ్మం జట్టుకు రూ. 15 వేలు, ఆరో స్థానంలో నిలిచిన సూర్యాపేట జట్టుకు రూ. 10 వేలు, ఏడో స్థానంలో ములుగు జట్టుకు, ఎనిమిదో స్థానంలో నిలిచి ఏకలవ్య వరంగల్ జట్టుకు రూ. 5 వేల చొప్పున అందజేశారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ రాయనబోయిన రామలింగయ్య, సర్పంచ్ యడవల్లి సుధారాణినాగరాజు, కబడ్డీ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కర్తయ్య, బీఆర్ఎస్ తిరుమలగిరి సాగర్ మండలాధ్యక్షుడు పిడిగం నాగయ్య, నాయకులు ఎన్నమల్ల సత్యం, జానకీరాములు, పీఈటీలు వెంకట్రాంరెడ్డి, పరమేశ్, శ్రీను, రాంబాబు, చంద్రశేఖర్ పాల్గొన్నారు.