సూర్యాపేట టౌన్, ఏప్రిల్ 19: సూర్యాపేట జిల్లా కేంద్రంలోని శ్రీహాన్ ఆసుపత్రిలో నిండు గర్బిణి శనివారం ఓ మహిళ ఒకే కాన్పులో ముగ్గురు శిశువులకు జన్మనిచ్చింది. అందులో ఇద్దరు మగ, ఒక ఆడ శిశువు ఉన్నారు. సూర్యాపేట మండలం రాయినిగూడెం గ్రామానికి చెందిన షేక్ షబానాకు మూడేండ్ల క్రితం వివాహం జరిగింది. గర్భం దాల్చిన ఆమె కాన్పు కోసం జిల్లా కేంద్రంలోని శ్రీహాన్ ఆసుపత్రిలో చేరింది.
డాక్టర్ విజిత గిరిధర్‌రెడ్డి హై రిస్క్ ప్రెగ్నెన్సీగా అడ్మిట్ చేసుకొని ఆపరేషన్ చేయగా ముగ్గురు శిశువులు జన్మించారు. వారిలో ఒకరు 1.8 కిలోలు, మరొకరు 1.5, ఇంకొకరు 1.5 కిలోల బరువుతో ఉన్నారు. ప్రస్తుతం తల్లీబిడ్డలు క్షేమంగా ఉన్నట్లు డాక్టర్ తెలిపారు.