నార్కట్‌పల్లి జూన్ 15: చెర్వుగట్టు శ్రీ పార్వతీ జడల రామలింగేశ్వస్వామి ఆలయ సమీపంలోని గుట్టపై ఉన్న ఎల్లమ్మ గుడి వద్ద బోనాల కుండల విక్రయాల మధ్య తలెత్తిన వివాదం ఘర్షణకు దారితీసింది. ఇందుకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. శాలివాహన కులానికి చెందిన రెండు వర్గాల మధ్య సోమవారం వివాదం చెలరేగడంతో ఈ ఘర్షణ జరిగింది. గత కొంతకాలంగా ఇరువర్గాల మధ్య ఉన్న ఈ వివాదం చిలికి చిలికి గాలివానలా మారింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం కుండల అమ్మకం, బోనం సమర్పణ వాటాల విషయంలో ఒకే కులానికి చెందిన రెండు వర్గాల మధ్య తలెత్తిన వివాదం బ్లేడ్లతో దాడి చేసుకునే వరకు వెళ్లింది.
ఈ దాడిలో బొడ్డుపల్లి జ్యోతి, బొడ్డుపల్లి భవానీల చేతులపై గాట్లు పడి తీవ్ర గాయాలయ్యాయి. ఎల్లారెడ్డిగూడెం గ్రామానికి చెందిన శాలివాహన కులస్తులు ఇక్కడ వంతుల వారీగా బోనం కుండలు విక్రయిస్తూ ఉంటారు. అయితే తోబుట్టువుల్లేని అదే గ్రామానికి చెందిన ఓ వివాహిత ఇందులో తనకు కూడా వాటా ఇవ్వాలని గత కొంతకాలంగా గొడవ పడుతోంది. ఈ క్రమంలో వంతుల్లో ఉన్న జ్యోతి, భవానీలపై ఆమె బ్లేడ్‌తో దాడి చేసింది. ఇది గమనించి స్థానికులు మహిళల ఘర్షణను అడ్డుకున్నారు. గతంలోనూ ఈ విషయమై ఇరు వర్గాలు నాయకుల చుట్టూ, పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. దాడి అనంతరం భక్తులు ఎల్లమ్మ గుడికి బోనం పెట్టాలంటేనే భయపడ్డారు. ఈ ఘటనపై పోలీసులకు సమాచారం అందడంతో ఇరువురిని చికిత్స నిమిత్తం దవాఖానకు తరలించి కేసు నమో దు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.