తుంగతుర్తి నియోజక వర్గంలో కరువుచాయలు అలుముకున్నాయి. చెరువులు, కుంటలు, బోర్లు వట్టి పోతున్నాయి. వేల రూపాయలు అప్పులు తెచ్చి గతంలో మాదిరిగా ఎస్సారెస్పీ కాల్వల ద్వారా సాగునీరు అందుతుందనే ఆశతో అన్నదాతలు 90 వేల ఎకరాల్లో వరి సాగు చేశారు. ప్రస్తుతం పొట్టదశలో ఉన్న వరి పొలాలకు సాగునీరు అందక 30 శాతం ఎండిపోగా రైతులు పశువులు, మేకలు, గొర్రెలను మేపుతున్న దుస్థితి నెలకొంది.
2012 పరిస్థితులు పునరావృతం
సమైక్య రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు మళ్లీ పునరావృతం అవుతుండటంతో అన్నదాతల్లో ఆందోళన మొదలైంది. భూగర్భ జలాలు వేగంగా అడుగంటుతున్నాయి. రెండు నెలలు అయితే పంట చేతికి అందుతుందనగా కరువు పరిస్థితులు రైతులను కలవర పెడుతున్నాయి. కనీసం పెట్టుబడి కూడా రాని దుస్థితి ఏర్పడింది. ఎస్సారెస్పీ ఆయకట్టు రైతుల పరిస్థితి మరీ దారుణంగా మారింది. నియోజక వర్గంలోని దాదాపు 300లకు పైగా చెరువులు నీళ్లు లేక ఎండుముఖం పట్టాయి. నిండుగా పోసే బోర్లు ఆగి ఆగి పోస్తున్నాయి. 200 ఫీట్లు లోతు బోర్లు వేసినా చుక్క నీరు రావడం లేదు. ఇక పంట పొలాలు బీడు భూములుగా మారుతున్నాయి.
నాన్ ఆయకట్టులోనూ అవస్థలు
నాన్ ఆయకట్టు ప్రాంతాల్లో సైతం భూగర్భ జలాలు అడుగంటి బోర్లు, బావులు వట్టి పోతున్నాయి. పంటలు కాపాడుకోవడానికి పడరాని పాట్లు పడుతున్నారు. తిరుమలగిరి మండలంలో చాలా చోట్ల రైతులు అప్పులు చేసి వ్యవసాయ బావుల్లో పూడికలు తీస్తున్నారు. పొట్ట దశలో ఉన్న పొలాలను కాపాడుకునేందుకు బోర్లు వేయించినా ఫలితం ఉండక అప్పుల ఊబిలో కూరుకు పోతున్నారు.
పంటంతా పశువుల పాలు
ఎండిన వరి చేనులో బర్లను మేపుతున్న ఈ రైతు పేరు మండ్ర సింహాద్రి. ఊరు శాలిగౌరారం మండలం బైరవునిబండ. నాలుగెకరాలు భూమి ఉండగా, నీళ్లు సరిపోతయో లేవోనని ఎకరన్నరలోనే రెండు బోర్ల ఆధారంగా వరి సాగు చేశాడు. పంట చేతికి వచ్చే దశలో బోర్లు ఎండిపోవడంతో పంటను కాపాడుకునేందుకు మరో రెండు బోర్లు వేయించాడు. అయినా నీళ్లు పడక పంటంతా ఎండిపోయింది. చేసేదిలేక పొలంలో బర్లను మేపుతున్నాడు. కండ్ల ముందు ఎండిపోతున్న పంటను కాపాడుకునేందుకు ఎంత ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయిందని సింహాద్రి ఆవేదన వ్యక్తం చేశారు.
-శాలిగౌరారం
పంట చేతికి వచ్చే పరిస్థితి కనిపించడం లేదు
ఏడు ఎకరాల్లో వరిసాగు చేసిన. ఇప్పటి వరకు 2.5 లక్షల రూపాయలు పెట్టిబడి పెట్టిన. గత సంవత్సరం బోరు కూడ వేసిన. అయినా నీళ్లు లేక వరి పంట ఎండుముఖం పడుతున్నది. చేసేది లేక పైపుల ద్వారా వరుస తడులు వేస్తున్నా. మూడు నాలుగు రోజులకు ఒక మడి తడుస్తుంది. వారం క్రితం 30 వేలు పెట్టి బోర్లు కడిగించిన అయినా ఫలితం లేదు. పంట చేతికి వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. తెచ్చిన అప్పులు ఎలా తీర్చాలో అర్థం కావడం లేదు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో వ్యవసాయం సంతోషంగా చేసినం. ఇలాంటి పరిస్థితులు వస్తాయని ఊహించ లేదు.
-బోయిని కొమరమల్లు, రైతు, తిరుమలగిరి
ఆరుతడి పంట కూడా ఎండుతున్నది
నాకున్న 8 ఎకరాల్లో 4 ఎకరాలు పత్తి వేసిన. యాసంగి నీటి సమస్య ఉంటదేమో మిగతా నాలుగు ఎకరాల్లో వరికి బదులు మొక్కజొన్న వేసిన. అయినా నీళ్లు అందక మొక్కజొన్న చేను ఎండుతున్నది. పంట కాపాడు కోవడానికి వేల రూపాయలు పెట్టి బావిలో పూడిక తీయిస్తున్నా. అయినా పంట చేతికి అందుతనే నమ్మకం లేదు. ఏం చేయాలో అర్థం కావడం లేదు.
– గోపాల్, రైతు, తుమ్మలకుంట తండా, తిరుమలగిరి
3 నుంచి 16 మీటర్లకు పడిపోయిన భూగర్భ జలాలు
తిరుమలగిరి మండలంలో అత్యం త వేగంగా పడిపోతున్న భూగర్భ జలాలు. కాల్వలకు జలాలు రాక, చెరువులు, కుంటలు ఎండిపోయి భూగర్భ జలాలు గణనీయంగా పడిపోతున్నాయి. తిరుమలగిరి మండలంలో గత సంవత్సరం 3.69 మీటర్ల లోతులో ఉన్న భూగర్భ జలాలు ప్రస్తుతం 16.71 మీటర్లకు పడిపోయాయి. నీళ్లు లేక పంటల ఎండిపోతుండడంతో రైతులు రైతులు మూడు నాలుగు రోజులకు ఒక్కసారి వరుస తడులు పెట్టి పంటలను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. రాజానాయక్ తండా, నందపురం గ్రామ ఆవాసం రామునిబండ తండా రైతులు వ్యవసాయ బావుల్లో పూడికతీతలు చేపట్టారు.
పంటను కాపాడుకోవడానికి ట్యాంకర్‌తో నీళ్లు
మోత్కూరు : భూగర్భ జలాలు అడుగంటి చేతికి వచ్చిన వరి పంట కండ్ల ముందే ఎండిపోతుండడంతో రైతులు తల్లడిల్లిపోతున్నారు. కొద్దోగొప్పో సాగు చేసిన వరినిగకాపాడు కోవడం కోసం రైతులు నీటి ట్యాంకర్‌తో పొలాన్ని తడుపుతున్నారు. మోత్కూరు మండలంలోని ముశిపట్లకు చెందిన రైతు కెమిడి ముత్యాలు నిత్యం ట్రాక్టర్ ట్యాంకర్‌తో నీటిని తెచ్చి పొలాన్ని కాపాడుతున్నాడు. అతను మూడు ఎకరాల్లో వరి సాగు చేయగా, పంట చేతికి వచ్చే దశలో నీళ్లు అందడం లేదని వాపోయాడు. ఎండి పోతున్న పంటను కాపాడుకోవడం కోసం రోజుకు 15 ట్యాంకర్లతో నీళ్లను తెచ్చి పోస్తున్నట్లు తెలిపాడు. మూడు ట్యాంకర్లతో 10 గుంటల వరి పొలం తడుస్తుందని, డబ్బులు ఖర్చు అయినా చేతిలో మిగిలేది ఏమీ ఉండదని ఆవేదన వ్యక్తం చేశాడు.
నిమ్మ తోటకూ నీళ్లు లేవు
శాలిగౌరారం : వరి పొలాలతోపాటు నిమ్మతోటకు కూడా నీళ్లు లేవు. మార్చిలోనే భూగర్భజలాలు ఎన్నడూ లేనంతగా అడుగంటిపోవడంతో బోర్లు ఆగిఆగి పోస్తున్నాయి. రైతులు నిమ్మతోటలను కాపాడుకునేందుకు భగీరథ ప్రయత్నం చేస్తున్నారు. నెలకు రూ.15వేలు అద్దె చెల్లించి ట్యాంకర్‌తో నీళ్లు పోయించి బతికించుకుంటున్నారు. శాలిగౌరారం మండలం తక్కెళ్లపహాడ్ గ్రామ పంచాయతీ పరిధిలోని వద్దింపాముల గ్రామానికి చెందిన రైతు భీమనబోయిన పోతయ్య రెండున్నర ఎకరాల భూమిలో 12 ఏండ్లుగా నిమ్మతోటను సాగు చేస్తున్నాడు. రెండు బోర్ల ద్వారా సరిపడా నీరందినప్పటికీ మునుపెన్నడూ లేనంతగా ప్రస్తుతం రెండు బోర్లు అడుగంటిపోయాయి.
కండ్ల ముందే నిమ్మ చెట్లు వాడిపోతుంటే తట్టుకోలేని పోతయ్య నెలకు రూ.15వేలు అద్దె చెల్లించి ట్యాంకర్‌ను తీసుకున్నాడు. తనకున్న ట్రాక్టర్ సహాయంతో ట్యాంకర్ ద్వారా బంధువుల వ్యవసాయ బోరు రెండు కిలోమీటర్ల దూరం నుంచి నీటిని తీసుకొచ్చి నిమ్మచెట్లకు నీటిని పెడుతున్నాడు. తీరుస్తున్నాడు. ఒక్క ట్యాంకర్ నీళ్లు 6నుంచి 7చెట్లకు మాత్రమే సరిపోతున్నాయని రైతు ఆవేదనతో చెప్పుకొచ్చాడు. మొత్తం 160చెట్లకు గానూ ఒక్క తడి తిరిగే సరికి వారం రోజులు పడుతుందని తెలిపాడు. మండలంలో మొత్తం 12ఎకరాల్లో నిమ్మ, బత్తాయి తోటలను రైతులు సాగు చేశారు.
4 ఎకరాలకు 30 గుంటలే మిగిలింది
నాలుగు ఎకరాలు వరిసాగు చేస్తే అంతా ఎండిపోయి 30 గుంటలు మాత్రమే కష్టకష్టంగా వరుస తడులతో పారుతున్నది. 2 లక్షల వరకు పెట్టిబడి పెట్టి మూడు బోర్లు వేసినా చుక్కనీరు రాలేదు. గతంలో ఎస్సాఎస్పీ కాల్వల ద్వారా పైపులు వేసుకొని పంటలు పండించుకునే వాళ్లం. ఉన్న బోర్లు కూడా నిండుగా నీళ్లు అందించేవి. ప్రస్తుతం బోర్లు ఎండిపోయి నీళ్లు లేక వేసిన వరి పంట ఎండుతున్నది. ఈ ప్రభుత్వం రైతులను పట్టించుకుంట లేదు .
-శ్రీను ముదిరాజ్, చింతకుంట తండా, తిరుమలగిరి
నాలుగు ఎకరాలు ఎండిపోయింది
నేను యాసంగిలో 8 ఎకరాలు వరిసాగు చేసిన. ప్రస్తుతం 4 ఎకరాలు ఎండిపోయింది. పశువులకు మేతగా మారింది. ఉన్న నాలుగు ఎకరాలైన కాపాడుకోవాలని 3 బోర్లు వేసినా చుక్కనీరు రాలేదు. 20 వేలు పెట్టి బోరు శుభ్రం చేయించినా ఉపయోగం లేదు. 3 లక్షల వరకు పెట్టుబడి పెట్టినా కనీసం పెట్టుబడి కూడా రాని దుస్థితి నెలకొంది. ఉన్న కొద్దిపాటి వరిపొలానికి 4 రోజులకు ఒక మడి చొప్పున వరుస తడులు పెడుతున్నా కరెంట్ సక్రమంగా రాక పోవడంతో చివరి మడి వరకు నీరు అందడం లేదు. ఇంకా 20 రోజులు నీరు అందాలి. కానీ అలాంటి పరిస్థితులు లేవు. ఈ ప్రభుత్వం వచ్చి కరువు తెచ్చింది. ఎస్సారెస్పీ కాల్వల్లో నీళ్లు ఉంటే భూగర్భ జలాలు పెరిగేవి. కేసీఆర్ హయాంలో రైతులకు ఏ బాధలు లేవు.
-బొడ్డు సైదులు, మామిడాల, తిరుమలగిరి
చుక్క నీరు లేక.. దీనావస్థ
తుంగతుర్తి : మండల వ్యాప్తంగా నీళ్లు లేక వరి పొలాలు ఎండిపోతున్నాయి. పొట్ట దశలో ఎండిపోతుండడంతో అన్నదాతలు కంటతడి పెడుతున్నారు. లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టి సాగు చేసిన వరి పైరు ఎండిపోవడంతో చేసేదేమీ లేక బర్లు, గొర్రెలను మేపుతున్నారు. మిగిలిన కాస్త పంటలకైనా ఎస్సారెస్సీ కెనాల్ కాల్వల ద్వారా కాళేశ్వరం జలాలను అందించి ఆదుకోవాలని రైతులు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.
నీళ్లు వస్తాయని ఆశతో సాగు చేశాం
ఎస్సారెస్పీ కాల్వల ద్వారా నీళ్లు వస్తాయని ఆశతో ఐదెకరాల్లో వరి సాగు చేసిన. లక్ష రూపాయల వరకు పెట్టుబడి పెట్టిన. ప్రభుత్వం నీళ్లు అందించలేకపోవడంతో ఇప్పటికే సగం పంట ఎండిపోయి పశువులకు మేతైంది. మిగిలిన పంటకైనా నీళ్లు అందించి ఆదుకోవాలి. లేకపోతే మాకు ఆత్మహత్యలే శరణ్యం.
-పోలేటి మల్లయ్య రైతు తుంగతుర్తి
రెగ్యులర్‌గా ఎస్సారెస్పీ నీళ్లు ఇవ్వాలి
ప్రస్తుతం వరి పొలాలు పొట్ట దశలో ఉండడంతో నీళ్లు చాలా అవసరం. ఎస్సారెస్పీ కాల్వకు వారబందీ విధానంలో నీటిని విడుదల చేయడంతో ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్నందున పొలాలకు నీళ్లు అందడం లేదు. 15రోజులపాటు వరుసగా సాగునీటిని అందిస్తేనే పంటలు చేతికొస్తాయి. ఇచ్చిన షెడ్యూల్ కూడా సవరించి ఏప్రిల్ చివరి వరకు సాగునీరు అందించాలి.
కన్నెబోయిన మల్లేశ్, రైతు, నాగారం బంగ్లా