– మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ బచ్చలకూరి శరత్చంద్ర
నీలగిరి, ఏప్రిల్ 20 : ప్రజల సహకారంతోనే స్వచ్ఛ నల్లగొండ- హరిత నల్లగొండ సాధ్యమవుతుందని నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ బచ్చలకూరి శరత్చంద్ర అన్నారు. నల్లగొండ నగరాన్ని పరిశుభ్రంగా, పచ్చదనంతో కూడిన ఆదర్శ నగరంగా తీర్చిదిద్దే లక్ష్యంతో సోమవారం ఉదయం 12, 27, 28వ డిబిజన్లలో పారిశుధ్య కార్యక్రమాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం ఇంటి పన్నుల వసూళ్ల కార్యక్రమాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఇంటి వారు తమ గృహ వ్యర్థాలను వీదుల్లో, ఖాళీ స్థలాల్లో లేదా డ్రైన్లలో వేయకుండా తప్పనిసరిగా మున్సిపల్ శానిటేషన్ వాహనాలకే అందించాలని విజ్ఞప్తి చేశారు. “ఇంటి చెత్తను శానిటేషన్ వాహనాలకే ఇవ్వండి – నల్లగొండను పరిశుభ్రంగా ఉంచండి” అని పౌరులకు పిలుపునిచ్చారు. అధికారులు, సిబ్బంది, ప్రజలు సమన్వయంతో పనిచేస్తేనే నల్లగొండను ఆదర్శ నగరంగా తీర్చిదిద్దవచ్చన్నారు.
డ్రైన్లలో పేరుకుపోయిన సిల్డ్, చెత్తను వెంటనే తొలగించి నీటి నిల్వలు లేకుండా చర్యలు చేపట్టాలని, ప్రతిరోజూ స్వీపింగ్ కార్యక్రమాలు క్రమం తప్పకుండా నిర్వహించాలని, అలాగే కమర్షియల్ ఏరియాల్లో ప్రతిరోజూ విధిగా చెత్త సేకరణ జరగాలని సూచించారు. డోర్ టు డోర్ చెత్త సేకరణను మరింత సమర్థవంతంగా నిర్వహించి, ప్రతి ఇంటి నుండి తడి వ్యర్థాలు, పొడి వ్యర్థాలు వేర్వేరుగా సేకరించాలన్నారు. గృహస్థులు తడి-పొడి వ్యర్థాలను వేరు చేసి ఇవ్వడం ద్వారా వ్యర్థాలను శాస్త్రీయంగా ప్రాసెస్ చేసి జీరో ల్యాండ్ ఫిల్లింగ్ లక్ష్యాన్ని సాధించవచ్చని తెలిపారు. శానిటరీ సూపర్వైజర్లు ప్రతిరోజూ ఫీల్డ్ మానిటరింగ్ నిర్వహించి పారిశుధ్య కార్యకలాపాలను పర్యవేక్షించాలన్నారు. ప్రజల నుండి వచ్చే పారిశుధ్య ఫిర్యాదులు, ప్రజా సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. దోమల నివారణ, ఫాగింగ్, యాంటీ లార్వా చర్యలు, సీజనల్ వ్యాధుల నివారణ పై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో శానిటరీ సూపర్వైజర్ గడ్డం శ్రీనివాస్, ఇన్స్పెక్టర్ నంద్యాల ప్రదీప్తి, ఆర్ఓ శివరాంరెడ్డి, శానిటరీ జవాన్ కె.పరశురామ్, కాలనీ ప్రజలు పాల్గొన్నారు.